ప్రభాస్ హీరోగా నటించిన కొత్త సినిమా మిర్చి. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వడం, అనుష్క, రిచా గంగోపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ప్రజాధరణ పొందడంతో ‘మిర్చి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ తాజా సినిమా ఎలా ఉందో చూద్దాం..!
చిత్రకథ :
ఇటలీ లో ఉండే జై [ప్రభాస్] అక్కడ ఎం.ఎస్ చదువుతున్న మానస [రిచా]తో పరిచయం అవుతుంది. మానస సంతోషం కోసం ఆమె ఇంట్లో వాళ్ళను, ఆమె ఊరు వాళ్ళను మార్చడం కోసం జై ఇండియాకు వస్తాడు. అక్కడి వారిని మెప్పిస్తాడు. దీంతో మానసకు జై ను ఇచ్చి వివాహం చేయాలని అంతా భావిస్తారు. అప్పడు జై తన గతం గురించి చెపుతాడు. జై ఎవరు..., అతను ఎందుకు మానస ఇంట్లోకి ప్రవేశించాడు... అనేది చిత్రకథ.
నటీనటుల ప్రతిభ :
మిర్చి సినిమా ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమాను తన భుజాల మీద నడిపించాడు. గతంలో ఏ చిత్రంలోనూ లేనంత అందంగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించాడు. ఈ సినిమాలో అతన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవనిపిస్తాయి. యాక్షన్ దృశ్యాలను ఇరగదీసిన ప్రభాస్, పాటల్లోనూ తనదైన నృత్యాలతో ఆకట్టుకుంటాడు. అలాగే ఈ సినిమాలో మూడు రకాల గెటప్స్ తో కనబడతాడు. ఎన్నాఆర్ ఐ గా, ఆర్కిటెక్ట్ గా క్లాస్ లుక్ తోనూ, మాస్ లుక్ తోనూ ప్రభాస్ మూడు విధాలుగా కనిపిస్తాడు. ఈ మూడు రకాలుగా చాలా వైవిధ్యంగా కనిపిస్తూ ఆకట్టుకుంటాడు. ప్రభాస్ మరదలిగా అనుష్క నటించింది. ఇద్దరి జోడి బావుంది. ఇద్దరి మధ్య జరిగే దృశ్యాలు చాలా బాగా వచ్చాయి. రిచాది పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర. హీరో తండ్రి పాత్రకు సత్యరాజ్ వన్నె తెచ్చాడు. నెగటివ్ పాత్రలతో మెప్పించే సుబ్బరాజు ఈ చిత్రంలో విభిన్న తరహా పాత్రలో నటించాడు. ఈ పాత్రలో కామెడీ ఛాయలు ఉంటాయి. బ్రహ్మనందం, సత్యం రాజేష్ లు నవ్విస్తారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
ఫోటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. సంగీతం బావుంది. నేపధ్య సంగీతంతో పాటు ‘కాటుక కళ్ళు..’ ‘డార్లింగే.. ’ వంటి పాటలు ఆకట్టుకుంటాయి. పాటల చిత్రకరణ కూడా బాగుంది. ‘నువ్వు మా ఊరు రావాలంటే స్కెచ్ వేసుకుని రావాలి. నేను మీ ఊరుకి హ్యంగర్ కు ఉన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తా’ వంటి మాటలు అక్కడక్కడ బాగున్నా... దర్శకుడు గతంలో రచయిత అన్న అభిప్రాయాన్ని ఈ సినిమాలోని మాటలు కలిగించవు. కొరటాల శివ నుంచి ఇంకా మంచి సంభాషణలను ఆశిస్తాము. నిర్మాణ విలువలు బాగున్నాయి.
దర్శకత్వం విషయానికి వస్తే కొరటాల శివ తన తొలి చిత్రంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. ప్రభాస్ క్రేజ్ నే నమ్మకున్నాడు. ఫ్యాక్షన్, పగ ప్రతీకారల నేపథ్యాన్నే ఎన్నుకున్నాడు. ప్రభాస్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా ప్రారంభం బాగున్నా తరువాత ఫస్ట్ ఆఫ్ అంతగా ఆకట్టుకోదు. అయితే సెకండాఫ్ లో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్, ప్రభాస్-అనుష్కల మధ్య సన్నివేశాలు జోరుగా సాగుతాయి. అందరూ ఊహించే ముగింపుతోనే సినిమా ముగుస్తుంది.
హైలెట్స్ :
ప్రభాస్, ప్రభాస్-అనుష్కల మధ్య సాగే సన్నివేశాలు, పాటలు
డ్రాబ్యాక్స్ :
సాధారణ కథ, సాధారణంగా సాగే ముగింపు
విశ్లేషణ :
రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ తన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాలో ఎలాంటి అద్భుతాలు చేయలేదు. ప్రభాస్ పేరుతో హిట్ కొట్టాలని చూశాడు. సత్యరాజ్ పాత్రను గొప్పగా చూపించాలని ప్రయత్నించినప్పుడు అతను ఊరు ప్రజల కోసం ఏదైనా సన్నివేశాలను చూపించవచ్చు. అలాగే విలన్ పాత్రలో మార్పు తేవడానికి హీరో చేసే ప్రయత్నాలు కూడా కృత్రిమంగా అనిపిస్తాయి. అలాగే ఈ కథను గతంలో చాలా సార్లు తెలుగు సినిమాల్లో చూశాం. రెండు ఊర్ళకు మధ్య గొడవలు జరగడం, హీరో వచ్చి ఆ గొడవలను పరిష్కరించడం, ఆ హీరో ఎవరు అనే విషయాన్ని ఫ్యాష్-బ్యాక్ లో చెప్పడం వంటి కథలు చాలా సినిమాల్లో చూసి ఉంటాం. అయితే ఈ సినిమాకు విదేశీ, కాలేజ్ నేపథ్యాలను కూడా కలిపారు. ఈ విధంగా మార్చి సినిమా సాగుతుంది. ట్విస్ట్ లు లేకుండా సాగే ఈ సినిమాలో ముగింపు కూడా చాలా సాధారణంగా ఉంది. ముఖ్యంగా పక్షవాతం నుంచి బెనర్జీ కోలుకునే సన్నివేశం కూడా ప్రేక్షకులను మెప్పించదు. అయితే నాగినీడు ఒక అమ్మాయిని కాలేజ్ లో చేర్పించే సీన్, ప్రభాస్ - అనుష్కల పాత్రల చిత్రీకరణ, వాటిని వారు మెప్పించిన తీరు బాగున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు తప్పకచూడాల్సిన సినిమా ఇది.
చివరగా :
‘మిర్చి’ లాంటి సినిమా (అందరికీ నచ్చాలని లేదు)