Kadali: తెలుగు ట్వీట్ రివ్యూ || Tweet Review || English Full Review

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా కడలి. దాదాపుగా 2 సంవత్సరాల విరామం తరువాత మణిరత్నం ఈ కడలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నట వారసులు గౌతమ్ కార్తీక్, తులసి ఈ సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అర్జున్, అరవింద్ స్వామి, లక్ష్మీ ప్రసన్న ఇతర ముఖ్య పాత్రలను పోషించిన ఈ కడలి సినిమా ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ :  ‘కడలి’ కథ విషయానికి వస్తే శ్యామ్ [అరవింద్ స్వామి], బెర్క్ మాన్స్ [అర్జున్] ఒకే క్రిస్టియన్ స్కూల్లో శిక్షణ పొందుతారు. బెర్క్ మాన్ చేసిన ఒక తప్పు కారణంగా అతన్ని స్కూల్ నుంచి స్యామ్ వెల్లగొట్టిస్తాడు. దీంతో స్యామ్ మీద పగతీర్చుకోవాలనుకుంటాడు బెర్క్ మాన్. ఆ తరువాత శ్యామ్  చర్చి ఫాదర్ గా పని చేస్తూ థామస్ (గౌతమ్ కార్తీక్) అనే ఆనాధ కుర్రాడ్ని ప్రయోజకుడ్ని చేయాలని అనుకుంటాడు. అయితే థామస్ మాత్రం ప్రియ (తులసి) ప్రేమలో  పడతాడు. బైబిల్ స్కూల్ నుంచి వెల్లగొట్టబడిన బెర్క్ మాన్ శ్యామ్ మీద పగతీర్చుకున్నాడా...?, ప్రియ ఎవరు...?, థామస్ ప్రేమగెలిచిందా...? అనేది చిత్రకథ.       నటీనటుల ప్రతిభ :     అర్జున్, అరవింద్ స్వామి తమకు ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు. సుదీర్ఘ కాలం తరువాత వెండి తెర మీద కనిపించినా అరవింద్ స్వామిలో కళ తగ్గలేదు. నెగటివ్ ఛాయలు ఉన్న పాత్రను అర్జున్ రక్తి కట్టించాడు. గౌతమ్ కార్తీక్ కు తొలి చిత్రమే అయినా ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. థామస్ పాత్ర అతని కోసమే సృష్టించినట్లు అనిపిస్తుంది. తులసి ఆకట్టుకుంటుంది. నటనపరంగా తులసి ఫరవాలేదనిపించుకున్నా.. రాధ అందం ఆమె రెండవ కుమార్తెకు కూడా రాలేదని అనిపిస్తుంది. మంచు లక్ష్మీ చాలా చిన్న పాత్రను పోషించింది. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర అది. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.   సాంకేతిక వర్గం పనితీరు :   ఈ సినిమాకు ఫోటోగ్రఫీ హైలెట్, కథలోకి ఫోటోగ్రఫీ మనల్ని లాక్కుని వెళ్లుతుంది. అరవింద్ స్వామి-అర్జున్ యుక్త వయస్సు దృశ్యాలను ఒక విధంగాను, ప్రస్తుత దృశ్యాలను మరొక విధంగా చూపించడం బాగుంది. సముద్రాన్ని అందంగా, భయం కలిగించేటట్లు కూడా చూపించారు. సంగీతం బావుంది. ‘యాడికే..యాడికే’, ‘పచ్చని తావి’ పాటల చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. కొన్ని కొన్ని మాటలు  బైబిల్ సూక్తులను గుర్తుకు తెస్తాయి. ‘మనిషికి పాపం నేర్పడం నడక నేర్పడం లాంటిది. మంచి నేర్పడం ఎగరడం నేర్పించడం లాంటిది. అందుకు చాలా శక్తి కావాలి’ వంటి మాటలు ఆలోచింపచేస్తాయి. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి. దర్శకుడు మణిరత్నం తన చెప్పదల్చుకున్న కథను తన పద్ధతిలో చెప్పాడు. దైవం-సైతాన్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. దీనికి ప్రేమకథను కూడా జోడించాడు. అరవింద్ స్వామి-అర్జున్ వంటి సీనియర్ నటులను, గౌతమ్-కార్తీక్ వంటి కొత్త వారిని తీసుకున్నా తన పద్థతిలో వారిని వెండితెర మీద చూపించాడు. కథనం కొంచెం స్లోగా నడిచినా కథను చెప్పడంలో మణిరత్నం ఎక్కడా గాడి తప్పలేదు. మణిరత్నం శైలిని అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.   హైలెట్స్ : ఫోటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం డ్రాబ్యాక్స్ :   నెమ్మదిగా నడిచే కథనం, వినోదానికి ప్రాధాన్యం లేకపోవడం, క్రిస్టియన్ మతం గురించి ఎక్కువగా చెప్పడం విశ్లేషణ : మణిరత్నం గత సినిమాను ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కిస్తే.. ఈ తాజా చిత్రంలో దైవ భక్తులకు-దుష్టులకు మధ్య జరిగే నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. దీనికి ప్రేమకథను కూడా జోడించారు. ఈ సినిమా అంతా మణిరత్నం పూర్వవైభవాన్ని గుర్తుకుతేలేక పోయినా తన మార్కు సన్నివేశాలను ఈ సినిమాలో చూపిస్తాడు. కొన్ని పాటల చిత్రకరణలోనూ, నేర స్వభావం కలిగిన కుర్రాడు ‘తల్లి బిడ్డకు జన్మనిచ్చే దృశ్యం’ చూసి తన ప్రవర్తన మార్చుకోవడం.. వంటి దృశ్యాల్లో మణిరత్నానికి మాత్రమే సాధ్యమయ్యే శైలి కనిపిస్తాయి. ఒక మతానికి చెందిన నేపథ్యం తీసుకోవడం, వినోదం లేకపోవడం, స్లోగా నడిచే కథనం... వంటి లోపాలు లేకపోతే ఈ సినిమా మరింత మంచి సినిమా అయిఉండేది. క్రిస్టియన్ మతం, సముద్రం నేపధ్యాలను తీసుకోవడం కారణంగా ఈ సినిమా కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుందని అనిపిస్తుంది. అదే విధంగా యువతను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లోపించడం ఆంశాలు  ఈ సినిమా విజయాన్ని అడ్డుకునే ప్రమాదం ఉంది.   చివరగా :     నదిలా సాగే ‘కడలి’     

More Articles on Kadali || Kadali Wallpapers || Kadali Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: