హమ్ తుం అనే టెలివిజన్ షో కి గెస్ట్ గా వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ అయిన పల్లవి(సిమ్రాన్) అక్కడ తన గతాన్ని చెప్పడం మొదలుపెడుతుంది. కాలేజీ లో తన ప్రేమ కథను చెప్పడం మొదలుపెడుతుంది. చరణ్ (మనీష్) చాలా తెలివయిన కుర్రాడు ఒక లక్ష్యం తో ఉంటాడు. చరణ్ ని చూడగానే ఇష్టపడుతుంది పల్లవి అప్పటి నుండి చరణ్ కూడా తనని ఇష్టపడేలా చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది నిజానికి అసలు అందంగా ఉందని పల్లవి చరణ్ కోసం అందంగా తయారవుతుంది చరణ్ మూలంగానే కాలేజీ ఫస్ట్ కూడా వస్తుంది, కాని పల్లవి ఎప్పుడు చరణ్ కి తన ప్రేమను చెప్పదు అలానే చరణ్ తన లక్ష్యం వైపు సాగుతుంటాడు కాని పల్లవి ప్రేమను గుర్తించడు. ఇది ఇలా సాగుతుండగా వీరిద్దరి మధ్యలోకి సాగర్ (నిఖిల్) ప్రవేశిస్తాడు , పల్లవిని చూడగానే సాగర్ ప్రేమలో పడ్డానని తన ప్రేమను వ్యక్త పరుస్తాడు, అక్కడనుండి కథ మళ్ళీ మొదటికి వస్తుంది పల్లవి తన ప్రేమను చరణ్ కి చెప్పిందా? లేక సాగర్ పల్లవి ప్రేమను గెలుచుకున్నాడా ? అసలు ఎవరి ప్రేమ కథ గెలిచింది లాంటి ప్రశ్నలు ఉంటె థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే ...
హీరో మనిష్ కోపానికి ,బాధకి ప్రేమకి ఆనందానికి ఇలా అది ఇదీ అని తేడా లేకుండా అన్నింటికీ ఒక్కటే హవభవంతో తనలోని స్థిరత్వాన్ని చాలా దృడంగా చాటుకున్నాడు. కథానాయిక సిమ్రాన్ , మాములుగానే చూడటానికి మాములుగా ఉండే ఈ నటికీ అందవికారంగా మేకప్ వేసి హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్న పోటీ పెట్టారు? అందులో ప్రేక్షకుడు ఓడిపోయాడులెండి ... అంటే సిమ్రాన్ అటు అందం పరంగా ఇటు అభినయ పరంగా ఆ స్థాయిలో ఉంది అని నా ఉద్దేశం. ఇక ఎమ్మెస్ నారాయణ , నాగినీడు , ఏ వీ ఎస్ , ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలామంది సీనియర్ నటులే ఉన్న ఏదో నటించాలి అన్నట్టే కాని నటిస్తున్నట్టు ఎక్కడ కనిపించదు. ఇక స్క్రీన్ ఫిల్లింగ్ కోసం తీసుకున్న జూనియర్ నటులు "అతి" అనే పదం అతి చిన్నది అనిపించేలా నటించి ప్రేక్షకులను సాధ్యమయినంత మేరకు హింసించారు.
అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్తే పేజి లు పేజి లు అవుతుంది నిజానికి సాంకేతికపరంగా ఈ చిత్రంలో ఏదీ బాగోలేదు అందుకే ఒక్కో విభాగాన్ని ఒక్కో లైన్ లో చెప్పేస్తున్నాం ...
దర్శకత్వం (రామ్ భీమన) - దారుణం
కథ (ఆపిల్ స్టూడియోస్) - చిత్రంలో ఏమి చెప్పలేదు కాబట్టి మాకు ఏం చెప్పాలో తెలియట్లేదు
కథనం - రెండు గంటల చిత్రాన్ని ఇంత నెమ్మదిగా నడిపించచ్చు అనడానికి నిలువెత్తు సాక్ష్యం
మాటలు (రామ్ భీమన) - ఇంటర్నెట్ మెసేజ్ లనే పేపర్ మీద రాసేసి మాటలు అనేసారు
సంగీతం(మహతి) - రెండు పాటలు మాత్రమే పరవాలేదనిపించే స్థాయిని చేరుకున్నాయి
నేపధ్య సంగీతం(మహతి)- సన్నివేశానికి సంభంధం లేకుండా చాలా బాగా ఇచ్చారు
సినిమాటోగ్రఫీ - ఉన్నవాటిలో అంతో ఇంతో బాగుండే విభాగం ఇదే మరి
ఎడిటింగ్ (నందమూరి హరి) - అబ్బే రెండు గంటల సినిమానే ఏం "కట్" చేద్దాం అనుకున్నారేమో మరి ..
మేకప్ - మినిమం మూడు మీటర్ల మందం అనే అంశాన్ని మనసులో పెట్టుకొని ఈ విభాగం పని చేసినట్టు ఉంది చాలా సన్నివేశాలు మేకప్ వలనే మరింత దారుణంగా కనిపించయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
నిర్మాణ విలువలు : ఎందుకు ఖర్చు చేసారో తెలియట్లేదు కాని అనవసరమయిన చోట్ల చాలా ఎక్కువగా ఖర్చు చేసేసారు..
కొన్ని చిత్రాలు ఇలా తీసుంటే బాగుండేది అనిపిస్తుంది కొన్ని చిత్రాలు ఇంకోలా చేసుండాల్సింది అనిపిస్తుంది కాని చాలా కొద్ది చిత్రాలు మాత్రమే అసలు తీయకపోయుంటే బాగుండేది అనే స్థాయిని చేరుకుంటుంది. హమ్ తుం సరిగ్గా అలాంటి చిత్రమే ప్రేమికుల రోజు విడుదల అవుతున్న ప్రేమ కథ చిత్రం అని ఈ చిత్రానికి వెళ్ళిన ఎవరికయినా ఇదొక పీడ కలగా మిగిలిపోతుంది ఇక జంటగా వెళ్ళిన వారి సంగతి సరే సరి కలిసి లోపలి వెళ్ళిన వారి మనస్థితి మారిపోయి విడిపోయి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త!! . ఈ చిత్రం పెట్టిన హింస ఆ స్థాయిలో ఉంది. చిత్రం మొదటి నుండి చివరి వరకు ఏమీ ఉండదు అన్ని టైం పాస్ సన్నివేశాలే, ఇలాంటిదే కాకపోయినా చాలా దగ్గరగా పోలికలుండే చిత్రం "కాలేజీ" ఆ చిత్రంలో నటీనటుల పనితీరు చివర్లో శివాజీ ఆ అమ్మాయి ప్రేమను అర్ధం చేసుకోడం చాలా బాగుంటుంది కాని ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు నటించిన విధానం ప్రేమను చంపేసి విసుగును మొదలు పెడుతుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఎందుకో మరి ఇది ఎవరికీ అర్ధం కాని విషయం.
ఈ చిత్రంలో మంచి నటన లేదు, మంచి సాంకేతికత లేదు, అసలు ప్రేమ లేని ప్రేమ కథ ఇది .. సరిగ్గా చెప్పాలంటే ఎంతటి "లవర్ బాయ్ " అయినా ఈ చిత్రం చూస్తే అతనిలోని ప్రేమ కణాలన్నీ చచ్చిపోతాయి.. ప్రధాన పాత్రల మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చెయ్యకుండా ఆ అమ్మాయి బాధను అర్ధం చేసుకోమంటే ప్రేక్షకుడి పరిస్థితి అర్ధం చేసుకోండి. చిత్రానికి వెళ్ళిన ప్రేక్షకుడికి హీరో - హీరోయిన్ ని ఎందుకు ప్రేమిస్తాడో తెలియదు? హీరోయిన్ హీరో ని ఎందుకు ప్రేమిస్తుందో తెలియదు? అసలు మనం ఈ చిత్రానికి ఎందుకొచ్చామో తెలియదు? సింపుల్ గ ఈ చిత్రం రెండు గంటల నరకం లాంటి అనుభవం.. ఇంత చెప్పాక కూడా మీకు చిత్రాన్ని చూడాలి అనిపిస్తే అది ఆత్మ హత్య ప్రయత్నమే తరువాత మీ ఇష్టం
... Manish,Simran,M Shiva Rami Reddy,Ram Bheemana.హమ్ తుం : రెండు గంటల నరకం ..