వాసు (విశాల్) వైజాగ్ మార్కెట్ లో వడ్డీకి డబ్బులు ఇస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఒకరోజు వాసు అనుకోకుండా దివ్య( శృతి హాసన్) ని కలుస్తాడు. అప్పుడు మొదలయిన వారి స్నేహం మెల్లగా ప్రేమ వైపు దారి తీస్తుంది. ఇదిలా నడుస్తుండగా సింగన్న పాత్రుడు(ముఖేష్ తివారి) బొబ్బిలి లో గుడికి ధర్మకర్త, బయట సమాజానికి గౌరవప్రదంగా కనిపించే సింగన్న కాంట్రాక్టు తీసుకొని మనుషులను చంపుతుంటాడు, చాలా తెలివిగా ప్లాన్ చేసి మరి చంపుతుంటాడు. అతన్ని పట్టుకోడానికి వచ్చిన అధికారి శివరాం నాయక్(సత్యరాజ్) ని చంపించడానికి కాంట్రాక్టు తీసుకుంటాడు సింగన్న.. అలా ప్లాన్ చేసి చంపే సమయంలో వాసు అక్కడే ఉండటంతో శివరాంని కాపాడుతాడు వాసు. తను చేసిన ప్లాన్ బెడిసి కొట్టడంతో వాసుని ఎలా అయిన వెతికి పట్టుకోమని చెప్తాడు సింగన్న.. ఇదే సమయంలో సింగన్న ధర్మకర్తగా ఉన్న గుడికి ధర్మకర్తగా గోకరాజు కంపెనీ అధినేత ప్రయత్నించడంతో అతన్ని సింగన్న అవమానిస్తాడు.. ఆ విషయంగా సింగన్న ను వాసు కొడతాడు.. అసలు గోకరాజు కుటుంబానికి వాసు కి ఉన్న సంభంధం ఏంటి? సింగన్న కి తన ప్లాన్ చెడిపోయింది వాసు వలనే అని ఎలా తెలుస్తుంది? తెలిసాక ఎం చేసాడు? అనేది మిగిలిన కథ ...
విశాల్ , చిత్రం మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు ఈ నటుడు, సన్నివేశాలలో మరియు మాటల్లో పవర్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రేజేన్స్ తోనే పాత్రని పవర్ ఫుల్ గా చూపించాడు.. శృతి హాసన్ , ఈ పాత్ర ఉండాలంటే ఉన్నట్టు ఉంటుంది, పాటలు మరియు కొన్ని సన్నివేశాలలో మాత్రమే కనిపించింది. శృతి హాసన్ తన అభినయంతో ఆకట్టుకున్న దానికన్నా అందాలతో ఊరించిందే ఎక్కువ .. సత్య రాజ్ పాత్రకి ఇసుమంత ప్రాముఖ్యత లేకపోయినా ఆయన స్క్రీన్ మీద కనిపించిన విధానంతోనే పాత్రకి ప్రాముఖ్యత తెప్పించారు ... అయన పాత్రకి యువన్ ఇచ్చిన నేపధ్య సంగీతం కూడా కాస్త ఉపయోగపడింది.. సూరి చేసిన కామెడీ కొన్ని సన్నివేశాలలో నవ్వించి మెప్పించాడు... ముఖేష్ తివారి నటన పరవాలేదనిపిస్తుంది. జయప్రకాశ్, రాధిక , కౌశల్య, మనోబాల, రేణుక , సితార , అభినయ మొ|| ఇలా చెప్పుకోడానికి నీరసం వచ్చేంత తారాగణం ఉన్నా కూడా ఒక్కటి పాత్ర గురించి కూడా చెప్పుకొనే స్థాయిలో లేదు ..
దర్శకుడు హరి అనగానే వేగవంతమయిన కథనానికి ప్రతీక ఈ చిత్రాన్ని కూడా వేగంగా నడిపించాలన్న ప్రయత్నం చేసారు కాని ఒక్క సన్నివేశం కూడా సరిగ్గా కుదరలేదు కథాపరంగా ఇది చాలా పాత కథనే కథనంలో ముఖ్యాంశం అయిన హీరో ఎలివేషన్ దగ్గర హరి చాలా తడబడ్డాడు ఫైట్ లు పెట్టి హీరో ని హీరో లా చూపించాలని ప్రయత్నించారు కాని ఫైట్ లని మాత్రమే నమ్ముకొని ఉండాల్సింది కాదు.. అనవసరమయిన సబ్ ప్లాట్స్ ఎక్కువగా రాసుకొని విలన్ ని కన్ఫ్యూజ్ చెయ్యాలి అని ట్రై చేసి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి ఆయనే కన్ఫ్యూజ్ అయ్యారు.. మాటలు రచించిన శశాంక్ వెన్నెలకంటి పవర్ లెస్ గా పదాలు ఉపయోగించారు కొన్ని డైలాగ్స్ అయితే మరీ అర్ధరహితంగా ఉన్నాయి . హీరో ఎలివేషన్ సన్నివేశాల దగ్గర బూతులు మాట్లాడించితే పవర్ వచ్చేస్తుంది అనుకున్నారు.. అలా కుదరదు అని ఇప్పటికయినా తెలుసుకోవాలి.. ఇకపోతే సినిమాటోగ్రఫీ అందించిన ప్రియన్ కొన్న్ని సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినా కొన్ని సన్నివేశాల వద్ద మరీ నాసిరకం గా తయారయ్యింది.. ఎడిటింగ్ ఈ చిత్రంలో అతి పెద్ద మైనస్ .. ఏ సీన్ తరువాత ఏ సీన్ వస్తుందో క్లారిటీ ఉండదు చిత్రం పరిగెత్తాలి అని ఒక్క లక్ష్యంతో చేసినట్టు ఉన్నారు ఒక్కోసారి ఎం జరుగుతుందో కూడా అర్ధంకానంత వేగంగా కత్తిరించారు సన్నివేశాలు.. యువన్ శంకర్ రాజ అందించిన సంగీతంలో పాటల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు నేపధ్య సంగీతం మాత్రం బాగుంది.. నిర్మాణ విలువలు బాగున్నాయి...
మాస్ చిత్రాలు అనే మూస లో తెలుగులో వస్తున్న నాసిరకం అయిన చిత్రాలు చాలవని ఇపుడు తమిళ బాష నుండి అటువంటి మూసనే డబ్ చేస్తున్నారు .. మొన్న వచ్చిన "సికిందర్" ఈరోజు వచ్చిన "పూజ" వీటికి ఉదాహరణలు.. హీరో క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండాలంటే బూతులు మాట్లాడాలి, హీరోయిన్ కారణం లేకుండా హీరో ని ప్రేమించాలి, హీరో ఏమి చేసిన కారణం లేకుండా హీరో వాళ్ళ అమ్మ హీరోదే తప్పు అనుకోవాలి, క్రికెట్ పిచ్ మీద బాల్ బౌన్స్ అయినట్టు హీరో కొడితే మనుషులు బౌన్స్ అవ్వాలి .. అవసరం లేకపోయినా సందర్భరహితంగా కామెడీ పెట్టాలి.. అన్నింటికన్నా ముఖ్యమయిన రూల్ హీరో గట్టిగా అరవాలి, ఎంత గట్టిగా అంటే కనీసం ప్రేక్షకుడి చెవుల నుండి రక్తం రావాలి ఆ స్థాయిలో అరవాలి.. ఇలాంటి రూల్స్ ఫాలో అయ్యి , కథ బాగుండాలి, కథనం బలంగా ఉండాలి అన్న బేసిక్ రూల్స్ ని గాలికి వదిలేసారు.. శృతి హాసన్ డబ్బింగ్ మరియు చిత్రంలో లాజిక్స్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఈ చిత్రాన్ని ఇప్పటికే చాలా సార్లు చుసేసాం హరి గతంలో తెరకెక్కించిన "ఆరుళ్" , "ఆరు" ,"భరణి" , "వెంఘై" వంటి చిత్రాలని కలిపి ఒక చిత్రంలా మలిచినట్టు అనిపిస్తుంది. "యముడు" లాంటి చిత్రాలు చెయ్యగలిగిన సత్తా ఉన్న హరి ఇలాంటి చిత్రాలను మరొకసారి ప్రయత్నించకపోవడమే మంచిది. ఇక మీరు చూడాలా వద్దా అంటే .. దీపావళికి టపాకాయల శబ్దం కన్నా ఎక్కువ శబ్దం థియేటర్ లో వినాల్సి వస్తుంది ... తరువాత మీ ఇష్టం ...
Vishal,Sruthi Hassan,Hari,Yuvan Shankar Raja.పూజ - ప్రేక్షకులకు బడిత పూజ ..