మంచు లక్ష్మీ నటించి నిర్మించిన సినిమా ‘గుండెల్లో గోదారి’. ఈ సినిమాలో ఆది, సందీప్ కిషన్, తాప్సీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్నో సార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!
చిత్రకథ :
మల్లి [ఆది], చిత్ర [లక్ష్మీ ప్రసన్న] పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఆ గ్రామాన్ని వరదలు ముంచెత్తుతాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి ఇద్దరూ గడ్డివాము మీదకు చేరతారు. దాని మీద కొట్టుకుని పోతూ ఇద్దరూ తమ గతాల గురించి చెప్పుకుంటారు. వారి నేపథ్యాలు ఏమిటి..., ఆ ఇద్దరూ గడ్డివాము మీద నుంచి ఎలా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు..., అన్నదే చిత్రకథ.
నటీనటుల ప్రతిభ :
గ్రామీణ యువకుడిగా ఆది తన పాత్రలో ఒదిగిపోయాడు. అతని నటన చాలా సహజంగా ఉంది. మంచు లక్ష్మీ ఆహార్యం, మాట తీరు అన్నీ అచ్చమైన గోదావరి జిల్లా యువతిని కళ్ళ ముందు నిలిపాయి. ఉషారు అయిన పాత్రలో తాప్సీ మెప్పించింది. ఆమె నటన చూస్తే 1986 ప్రాంతంలో డబ్బున్న అమ్మాయిలు ప్రవర్తన ఇలానే ఉంటుందేమో అని అనిపిస్తుంది. సందీప్ కిషన్ పాత్ర నిడివి తక్కువ. పైగా అతని నటన ఎప్పటి మాదిరిగా ఉంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
వరదల దృశ్యాలను ఫోటోగ్రఫీ అద్భుతంగా తెరకెక్కించింది. నేపథ్య సంగీతం బావుంది. ‘గుండెల్లో గోదారి..’, ‘నిన్ను కలిపింది గోదారి..’ పాటలు గుర్తించుకునే విధంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఈ సినిమాలో కథ ఉన్నా కథనం చాలా స్లోగా నడుస్తుంది. కొన్ని దృశ్యాలు మరీ సాగదీసినట్లుగా ఉంటాయి. దీంతో నటీనటులు గొప్ప ప్రదర్శన కనబర్చినా సీన్లు బోర్ కొట్టిస్తాయి. పైగా ఈ కథ కూడా ఇప్పటిది కాదు 1986లో జరిగింది. నేటి ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ కావడం చాలా కష్టం.
హైలెట్స్ :
సంగీతం
లక్ష్మీ ప్రసన్న-ఆది-తాప్పీల ప్రదర్శన
డ్రాబ్యాక్స్ :
బోర్ గా సాగే కధనం
వినోదం గురించి పట్టించుకోకపోవడం
వరదలు-గోదావరి నేపథ్యం వంటి అంశాలతో కొందరికే పరిమితమైన చిత్రం
విశ్లేషణ :
1986లో సంభవించిన గోదావరి వరదల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా అదే విధంగా సాగుతుంది. తాను తెరకెక్కించాల్సిన విషయాన్ని ఫోటోగ్రఫీ-నేపథ్య సంగీతం సహాకారంతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే అతను 1986 సంవత్సరంలోనే ఉండిపోయాడేమో అని అనిపిస్తుంది. 1986 కు చెందిన కథాంశాన్ని తెరకెక్కించినా ఆ కథను ఈ కాలానికి చెందినట్లుగా మార్చడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీంతో ఈ సినిమా చాలా చోట్ల డాక్యుమెంటరీ ఫిల్మ్ గా సాగుతుంది. బోర్ కొట్టిస్తుంది.
మంచు లక్ష్మీ ఆవార్డులు తెచ్చిపెట్టే నటన ప్రదర్శించినా కథనం లోపంతో సినిమా చప్పగా సాగుతుంది. ప్రవీణ్, ధనరాజ్ వంటి కామెడీ అర్టిస్టులు ఉన్నా దర్శకుడు వారి మీద దృష్టి పెట్టలేదు. నేటి ప్రేక్షకులు వినోదం ఎక్కువగా కోరుకుంటున్నారనే విషయం మర్చిపోయాడు.
చివరగా :
‘గుండెల్లో గోదారి’.. 1986లో విడుదల కావాల్సిన సినిమా.