రాజేంద్ర ప్రసాద్, సారా అర్జున్ ల పెర్ఫార్మన్స్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని మోమెంట్స్ , సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ రాజేంద్ర ప్రసాద్, సారా అర్జున్ ల పెర్ఫార్మన్స్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని మోమెంట్స్ , సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ చాలా సింపుల్ స్టొరీ లైన్ , సాగదీసి వదిలిన కథనం , స్లో నేరేషన్ , ఎమోషన్స్ అస్సలు లేకపోవడం , సెకండాఫ్ , క్లారిటీ లేని అర్దాంతరపు ముగింపు , ఎడిటింగ్

గత ఏడాది తమిళంలో వచ్చిన 'శైవం' సినిమాకి రీమేక్ ఈ దాగుడుమూత దండాకోర్.. ఇప్పుడు తెలుగు సినిమా కథలోకి వస్తే.. కొబ్బరి తోటలు, పచ్చని పొలాలతో ఆహ్లాదకరంగా అనిపించే ఓ అందమైన పల్లెటూరు, ఆ పల్లెటూరిలో మనసున్న మారాజు అని అందరూ అనుకునే రాజు(రాజేంద్ర ప్రసాద్)గారి కథే ఈ 'దాగుడుమూత దండాకోర్' సినిమా.. రాజుగారికి తన మనవరాలు బంగారం(సారా అర్జున్) అంటే చాలా ఇష్టం. బంగారంకి తాతయ్య అన్నా ఇష్టం, అలాగే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్న నాని(కోడిపుంజు) అన్నా చాలా చాలా ఇష్టం. రాజు గారి ఊర్లో జరగనున్న పోలేరమ్మ జాతరకి ఎక్కడెక్కడో ఉన్న తన ఇద్దరు కొడుకులు, కూతురు వారి పిల్లలు అంతా కలిసి వస్తారు. రాజుగారి పిల్లలు అక్కడ ఉన్న సమయంలో హ్యాపీగా ఉన్నా వారి జీవితాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆ ఇబ్బందులకి కారణం పోలేరమ్మకి గతంలో మొక్కుకున్న మొక్కును తీర్చకపోవడమే కారణం అని నిర్ణయించుకున్న రాజుగారి ఫ్యామిలీ నానిని బలి ఇచ్చి మొక్కు తీర్చేసుకోవాలి అనుకుంటారు. కట్ చేస్తే నాని మిస్సింగ్.. ఎంత వెతికినా దొరకదు. అసలు నాని ఎలా మిస్ అయ్యింది.? మిస్ అవ్వడానికి గల కారణం ఏమిటి.? మిస్ అయిన నాని చివరికి దొరికిందా.? దాన్ని బలి ఇచ్చి రాజుగారి ఫ్యామిలీ మొక్కు తీర్చుకుందా.? లేదా.? అన్నది మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోండి..  

ఈ సినిమాకి ప్రాణం పోసే పాత్రలు రెండే రెండు.. అవే రాజేంద్ర ప్రసాద్, సారా అర్జున్ లు పోషించింది. సారా అర్జున్ పెర్ఫార్మన్స్ పరంగా పిచ్చెక్కించిందని చెప్పాలి. ఎందుకు అంటే అంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్ పెర్ఫార్మన్స్ ని చూపి అందరినీ షాక్ చేసింది. తనకి సినిమాలో డైలాగ్స్ చాలా తక్కువ, ఎక్స్ ప్రెషన్స్ ఎక్కువ. కానీ తను ఏ మాత్రం తగ్గకుండా ప్రతి సీన్ లో ఉండే భావాన్ని జస్ట్ తన కళ్ళతో పలికించేసింది. కొన్ని సీన్స్ లో నటకిరీటినే డామినేట్ చేసి పక్కకి తోసేసింది. ముందు ముందు ఈ సారా అర్జున్ కి మంచి మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముసలివాడైన రాజుగారి పాత్రలో డీసెంట్ నటనని కనబరిచాడు. డీసెంట్ అని ఎందుకు అన్నాను అంటే, ఆయన పెర్ఫార్మన్స్ చింపేసాడు, అదరగొట్టేసాడు అని చెప్పుకునేంత లేదు అలా అని తీసిపారేసెంత లేదు.. పాత్రకి ఎంత కావాలో అంత చేసాడు. యంగ్ కపుల్ గా కనిపించిన సిద్దార్థ్ వర్మ మరియు నిత్యా శెట్టిల నటన ఓకే. వారికున్న తక్కువ స్క్రీన్ టైంలో ఏదో అలా అలా చేసుకొని వెళ్ళిపోయారు. మైండ్ బ్లోయింగ్ నటన అని అనను కానీ మరీ బాలేదు అని చెప్పుకునేంత కూడా లేదు. రాజేంద్ర ప్రసాద్ కి పనివాడిగా చేసినతని పెర్ఫార్మన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. ఇకపోతే ఇద్దరు సవతుల ముద్దుల మొగుడుగా సత్యం రాజేష్, చిట్టిబాబుగా జబర్దస్త్ శ్రీనులు చేసింది ఒక్కొక్క సీన్ అయినా ఆ సీన్స్ తో ఆడియన్స్ ని నవ్విస్తారు. పెర్ఫార్మన్స్ లో మేజర్ గా చెప్పుకోవాల్సింది వీళ్ళే.. వీళ్ళు కాకుండా ముఖ్య పాత్రలు పోషించిన ప్రభు, రవిప్రకాష్, శ్రీ హర్ష, సంధ్య జనక్, బాలు మరియు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.      

'దాగుడుమూత దండాకోర్' ఇదొక రీమేక్ సినిమా... రీమేక్ అంటే తెలుగులో డైలాగ్స్ రాసుకోవడం, ఆ కథకి తగ్గట్టు ఇక్కడ నేపధ్యం సెట్ చేసుకోవడం కాదు డైరెక్టర్ చెయ్యాల్సింది.. రీమేక్ అనగానే డైరెక్టర్ చెయ్యాల్సిన మొదటి పని.. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఆత్మని ఇక్కడ ప్రెజెంట్ చెయ్యాలి, అక్కడ ఏ మేజిక్ అయితే వర్క్ అవుట్ అయ్యిందో అదే మేజిక్ ని ఇక్కడ తెలుగు వారికి కనెక్ట్ అయ్యేలా రిపీట్ చెయ్యగలగాలి అప్పుడే రీమేక్ చేసిన సినిమా వేరే భాషలోనూ హిట్ అవుతుంది. ఈ ఒక్కటి సరిగా చేయకుండా నువ్వు ఎంత బడ్జెట్ పెట్టినా, ఎంతమంది స్టార్ కాస్ట్ ని పెట్టుకున్నా అస్సలు ఉపయోగం ఉండదు. ఇదే మిస్టేక్ ఈ సినిమాలోనూ జరిగింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. దాగుడుమూత దండాకోర్ పరిస్థితి సగం ఉడికిన అన్నం(హాఫ్ బేక్డ్ రైస్)లా తయారయ్యింది. ఈ సినిమాలో కథ చాలా సింపుల్ అండ్ స్మాల్ లైన్.. చెప్పాలంటే చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి పెద్దలు చెప్పే కథలా ఉంటుంది. అలాంటి కథకి ఫస్ట్ హాఫ్ లో మనసుకు హత్తుకునే కొన్ని సీన్స్ కొన్ని ఉండడం వాటికి ఎంటర్టైన్మెంట్ ని జత చేయడంతో కథ పెద్దగా ముందుకు వెళ్లకపోయినా అలా అలా టైం పాస్ అయిపోతుంది. కానీ సెకండాఫ్ కి వచ్చే సరికే డైరెక్టర్ దారితప్పి పోయి గమ్యం ఎటో తెలియని గాలిపటంలా తయారయ్యి చివరికి సినిమాని ఎటో తీసుకెళ్ళి ఫినిష్ చేసాడని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వల్ కి ఓ 15 నిమిషాల ముందు మొదలైన కోడి మిస్సింగ్ పాయింట్ ని సెకండాఫ్ అంతా కూడా సాగదీయడం ఆడియన్స్ కి పిచ్చ బోర్.. సెకండాఫ్ స్టార్ అయినప్పటి నుంచీ చివరిదాకా 'పాయింట్ ఏమీ లేకుండా సినిమాని గంటసేపు సాగదీసిన వాడే మొనగాడు' అన్న స్టైల్ లో సాగుతూనే ఉంటుంది తప్ప బ్రేక్ అనేది ఉండదు. ఉన్న ఒకే ఒక్క పాయింట్ ని ఇంటర్వెల్ ముందు చెప్పేసాడు, ఆ తర్వాత ఏం చెయ్యాలో పాలుపోక సాగదీసి వదిలాడు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ నుంచి పోలేరమ్మకి మొక్కు అని ఓ పాయింట్ ని బిల్డప్ చేసుకుంటూ రావడం, అలాగే అందరికీ పలు సమస్యలను చూపించుకుంటూ వచ్చి వాటిలో ఒక్కదానికి కూడా సరైన ముగింపు ఇవ్వకుండా కథని హడావిడిగా ముగించేసి, ఉన్న పళంగా అందరికీ మంచి జరిగేలా చూపించడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ బుర్రని ఒక్కసారి గిర్రున తిరిగేలా చేస్తుంది. ముఖ్యంగా దేవుడు, దేవుడిపై నమ్మకం, మొక్కు  తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అంటే అంత సేపు సినిమాలో చూపించింది నిజమా.? లేక.? ఉత్తినే ఆడియన్స్ కి ఇంకో గంట సినిమా చూపించాలి కాబట్టి ఏదో రాసుకున్నాడా.? అన్నది డైరెక్టర్ కే తెలియాలి. అంత సేపు సాగదీసిన డైరెక్టర్ క్లైమాక్స్ పార్ట్ ని మాత్రం ఏదో ప్రపంచం మునిగిపోతున్నట్లు 'డబిడి దిబిడే' అన్న రీతిలో ముగించేయడం సినిమాకి పెద్ద మైనస్. ఇకపోతే చెప్పుకోవాల్సింది.. ఎమోషన్స్.. ఫస్ట్ హాఫ్ లో ఒకటి అరా సీన్స్ లో అన్నా ఎమోషన్స్ కనిపిస్తాయి, కానీ సినిమాకి చాలా అవసరం మరియు అవకాశం ఉన్న సెకండాఫ్ లో మాత్రం ఒక్క ఎమోషన్ కూడా కనిపించలేదు. సెకండాఫ్ కనెక్ట్ కాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. సినిమాలో అంత మంది కాస్టింగ్ ఉన్నా ఏ ఇద్దరి మధ్యా ఎమోషన్స్ ని సరిగా చూపించరు. ఇదే డైరెక్టర్ చేసిన మొదటి తప్పు, ఇక్కడే ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఆత్మని మిస్ చేసాడు..దీనివల్ల సగ భాగం మాత్రమే పనికి వచ్చింది, మిగతా సగ భాగాన్ని గోవిందా గోవిందా అనిపించాడు. అలాగే కథనం మొత్తం అతుకుల బొంతలా ఉంటుంది. ఏ మాత్రం ఆసక్తికరంగానూ ఉండకపోగా బాగా ఊహాజనితంగా సాగుతుంది. డైరెక్టర్ లో విషయం ఉంది కానీ రీమేక్ సినిమా ఎలా చెయ్యాలి అన్నదానిపై మాత్రం శిక్షణ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.      
జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద అసెట్. ఎందుకంటే అతను జస్ట్ విజువల్స్ ని జస్ట్ కలర్ఫుల్ గా చూపించి వదిలేయలేదు. ఆ పల్లెటూరి లొకేషన్స్ ని థియేటర్ లో ఉన్న ఆడియన్స్ ఫీలయ్యేలా చేసాడు. అలా చేయడం అంత సులభం కాదు. అందుకే జ్ఞాసేఖర్ సినిమాటోగ్రఫీకి ఓ హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఇఎస్ మూర్తి అందించిన పాటల్లో మీనింగ్ ఉంది, అలాగే పాటలు సందర్భానుసారంగా రావడం విశేషం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు డీసెంట్ గా ఉంది. అశోక్ కుమార్ పెద్దింటి రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయ్. ముఖ్యంగా మధ్య మధ్యలో మనిషిని ఆలోజింపజేసేలా రాసిన డైలాగ్స్ బాగున్నాయ్. రెండు గంటల సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగా ఎడిట్ చేసిన ధర్మేంద్ర సెకండాఫ్ లో కూడా అదే టెంపోని ఫాలో అయ్యి అనవసరపు సీన్స్ మరియు సాగదీసిన సీన్స్ ని కత్తిరించేసి రన్ టైంని తగ్గించి ఉంటే ఈ సినిమాకి చాలా హల్ప్ అయ్యేది. సురేష్ సాహి ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక రామోజీరావు - క్రిష్ కలిసి పెట్టిన ప్రతి రూపాయిని విజువల్స్ లో సూపర్బ్ గా చూపించారు. ఇక్కడ క్రిష్ - రామోజీరావు సినిమా మీద ఫ్యాషన్ తో, తక్కువ బడ్జెట్ లో తీసి ఎక్కువ మనీ కలెక్ట్ చెయ్యాలని ట్రై చేసారు, ఫ్యాషన్ ఒక్కటే ఉంటే సరిపోదు ఆ ఫ్యాషన్ కి మంచి కథ కూడా సెట్ అవ్వాలి.  
తమిళంలో వచ్చిన శైవం సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చి ఈ సినిమాని తెలుగులో తీయాలనుకోవడంలో తప్పులేదు, తెలుగు వారికి తగ్గట్టు మార్పులు చేయడంలోనూ తప్పు లేదు.. ఇక్కడ దాగుడుమూత దండాకోర్ టీం చేసిన తప్పల్లా ఒక్కటే.. అక్కడ ఉన్న మేజిక్ మరియు ఎమోషన్స్ ని ఇక్కడ కనెక్ట్ చెయ్యలేకపోవడం. అలాగే కథలో బిల్డప్ చేసుకుంటూ వచ్చిన పాయింట్ ని ఆడియన్స్ కి చేరువ చేయలేకపోవడం ముఖ్యంగా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడం ఈ సినిమాని ముంచేసింది. కథ చాలా సింపుల్ అయినా ఈ ఒక్క విషయంలో కేర్ తీసుకొని ఉంటే స్వచ్చమైన, అందమైన తెలుగుతనానికి అడ్డం పట్టే పల్లెటూరి కథగా ఈ సినిమా నిలిచిపోవడమే కాకుండా ఆడియన్స్ ని కూడా మెప్పించేది. ఓవరాల్ గా ఓకే ఫస్ట్ హాఫ్, సారా అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ల నటన ఈ సినిమాకి సేవింగ్ పాయింట్స్ అయితే థిన్ స్టొరీ లైన్, సాగదీసిన కథనం, స్లో నేరేషన్, సినిమాని అడ్డదారిలో తీసుకెళ్ళిన సెకండాఫ్, ఉండాల్సిన ఎమోషన్స్ బొత్తిగా లేకపోవడం ఈ సినిమాని ముంచేసే పాయింట్స్. సినిమా అయ్యేటప్పటికి ఆడియన్స్ బాగా నిరాశ చెందడమే కాకుండా బోబో బోబోబో బోబో అని కోళ్ళని పట్టడం నేర్పించాడా ఏంది మనకు అని పెదవి విరుస్తారు. దీనికి తోడు రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు కోరుకునే ఆడియన్స్ కి కూడా ఈ సినిమా ఎక్కదు.. ఓవరాల్ గా దాగుడుమూత దండాకోర్ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా లాభాలు లేకపోయినా, పూర్తి కుటుంబ కథా చిత్రాలను, పల్లెటూరి చిత్రాలను బాగా ఎంజాయ్ చెయ్యగలిగే వారికి కాస్తో కూస్తో నచ్చే సినిమాగా మిగిలిపోతుంది.        



Rajendra Prasad,Sara Arjun,RK Malineni,Ramoji Rao,E S Murthy.పంచ్ లైన్ : దాగుడుమూత దండాకోర్ - బో బోబోబో బోబో బోర్.!

మరింత సమాచారం తెలుసుకోండి: