కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ఇలయదళపతి విజయ్ త్రిపాత్రాభినయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 100వ చిత్రం ‘మెర్సల్’ రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో వివాదాలను ఎదుర్కొంటు వస్తుంది. యువ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘మెర్సల్’ టైటిల్‌ను ఉపయోగించకూడదని మరో నిర్మాత కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.
కాగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటు రిలీజ్ అయిన 'మెర్సల్' ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. జీఎస్టీపై ఈ సినిమాలో ఉన్న డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్న ఈ డైలాగులను తక్షణమే తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. మెర్సల్ చిత్రంలో సింగపూర్, భారత్‌లో అమలవుతున్న మెడికల్ ట్యాక్స్‌లపై ప్రశ్నలు సంధించాడు. సింగపూర్‌లో 7శాతం జీఎస్టీ వసూలు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యమందిస్తుంటే ఇండియాలో మాత్రం 28శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా ఉచిత వైద్యం మాత్రం అందడం లేదన్నారు.
అంతేకాదు హాస్పిటల్‌కు వెళితే ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరకడం లేదంటూ డైలాగ్‌లు పేల్చారు. దీంతో మెర్సల్ మూవీలోని జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై ఉన్న డైలాగ్‌లను ప్రధాని మోదీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక హీరో విజయ్ కు విలక్షణ నటుడు కమలహాసన్ మద్దతుగా నిలిచారు.
అన్ని విధాలుగా సెన్సార్ అయిన తర్వాతే, ఈ సినిమా రిలీజ్ అయిందని ఆయన అన్నారు. వ్యవస్థపై విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు. బీజేపీ నేతలు వివాదాస్పదంగా భావిస్తున్న సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.