భారతీయ చలన చిత్ర రంగంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి అకాల మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు యావత్ భారత దేశంలో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతిలోక సుందరి ఇక లేదని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే శ్రీదేవీ పుట్టింది తమిళనాడులో అయినా..తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది..ఆ తర్వాత తమిళ,మళియాళ, హీందీ, కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక శ్రీదేవి జన్మస్థలం తమిళనాడులోని శివకాశి..అయితే ఆమె అచ్చతెలుగు అమ్మాయని తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు తెలుగు కుటుంబాలకు చెందిన వారు కావడం విశేషం. వివరాల్లోకి వెళితే..శ్రీదేవి తాత కటారి వెంకటస్వామిరెడ్డిది తిరుపతి. అప్పట్లో ఆయన బస్ సర్వీస్ నిర్వహించేవారని..తిరుపతి-గ్యారపల్లి-జమ్మలమడుగు మార్గాల్లో ఆయన బస్సులు నడిపేవారట. ఈ క్రమంలో వెంకటస్వామిరెడ్డి జమ్మలమడుగులో నర్సుగా పనిచేస్తున్న వెంకటరత్నమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఆరుగురు సంతానం..పెద్ద కుమారుడు బాల సుబ్రహ్మణ్యం, ఆ తరువాత శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ, చిన్నాన్న సుబ్బరామయ్య, పిన్నిలు అనసూయమ్మ, అమృతమ్మ, శాంతమ్మలు. వీరంతా తిరుపతిలోని 93-టీకే వీధిలోని ఇంట్లో నివాసముండేవారు. కాగా, పెద్దకుమారుడు బాలసుబ్రణ్యం చెన్నైలో ఉద్యోగం సంపాదించారు..దీంతో తమ్ముడు, చెల్లెళ్లందర్నీ చెన్నై తీసుకెళ్లిపోయారు. ఇక శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ మినహా అందరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ సమయంలో రాజేశ్వరమ్మ సినిమా రంగంపై దృష్టి పెట్టడం..రంగారావు అనే చిన్నస్థాయి నటుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
వారి దాంపత్యానికి గుర్తుగా సూర్యకళ అనే కుమార్తె జన్మించింది. కొంత కాలంగా తర్వాత రంగారావు కనిపించకుండా పోయారు..ఆ సమయంలో శివకాశి తెలుగు కుటుంబానికి చెందిన, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక బిడ్డ తండ్రి అయ్యప్పన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరమ్మ, అయ్యప్పన్ కి శ్రీదేవి, శ్రీలత పుట్టారు.
శ్రీదేవి అక్క సూర్యకళను రాజేశ్వరమ్మ మేనత్త కుటుంబంలోని బంధువుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ సూర్యకళ కుమార్తే గులాబీ సినిమా హీరోయిన్ 'మహేశ్వరి'. శ్రీలతకు మధురైకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ తో వివాహం జరిపించారు. ఇక శ్రీదేవి భారతీయ చలన చిత్ర రంగంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో మూడు తరాల హీరోలతో నటించి మెప్పించిన ఘనత శ్రీదేవికే దక్కుతుంది.