అందానికే అందమైనిలిచి అర్ధశాతాబ్ధం పాటు చిత్ర భారతిని తన సౌందర్య నటనాపటిమతో జాతి యావత్తూ ఓలలూగించి దివికేగిన అతిలోకసుందరి ప్రముఖ సినీనటి శ్రీదేవి హఠాన్మరణం అనంతరం ఆమె పెద్దకుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి స్పందించింది.
మార్చి 7న తన 21వ జన్మదినం, తల్లి లేకుండా జరిగే తొలి జన్మదినం, సందర్భం గా తన మాతృమూర్తిని స్మరించుకుంది. తన జననిపై అమృతధారలు కురిపించి అందరి హృదయాలను జయించింది. భావోద్వేగంతో కూడిన లేఖను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.
"అమ్మా! నువ్వు గర్వపడేలా నీ ఆత్మ సంతృప్తి పడేలా చేస్తాను" అంటూ ఆ లేఖలో పేర్కొంది. అమ్మ తనకు దూరమైనా ప్రతి క్షణం తనతో తన మనసులో ఉన్నట్లే తన ను ఆమె ఆత్మ ఆవరించి ఉన్నట్లే భావిస్తాను. ఎప్పుడూ ఆమె ప్రేమ తన చుట్టూ ఆవహించి ఉన్నట్టు భావిస్తానని జాన్వీ తెలిపింది. అనూహ్యంగా, ఒక్కసారి అకస్మాత్తు గా తల్లి దూరమై అంధకారంగా మారిన తన జీవితం లో తన తల్లి నే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లతానని వెల్లడించింది. 'నీ ప్రేమ అజరామరం. ఇప్పటికీ నీ ప్రేమను హృదయాంతరంగాల్లోనుంచి పొందగలుగుతున్నాను. వేదన, ఆవేదన అంతా నువ్వే! ఈ జగత్తున వాటినుంది అనుక్షణం నన్ను రక్షిస్తావని భావిస్తాను"
తల్లి ప్రేమ వారికి ఒక "మధుర జ్ఞాపకం", ఈ జగాన ‘ఆమె’ లేకున్నా జ్ఞాపకంగా అనుక్షణం తట్టి లేపుతూనే ఉంటుందని మనసుకు సర్దిచెప్పుకోవడం కష్టమే! శ్రీదేవి కుమార్తె లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ల బాధ వర్ణనాతీతం. అమ్మ లేదన్న బాధను, ఆమె లేని జీవితాన్ని ఊహించుకో లేక కుంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తన తల్లికి రాసిన ఉత్తరం అందర్నీ కలచివేస్తోంది.
![Image result for jhanvi's excellent pictures](https://s-media-cache-ak0.pinimg.com/originals/8e/a6/6f/8ea66f638656fa9fa443576a844331be.jpg)
"ఎన్నటికీ భరించలేని బాధ, దుఃఖం నా హృదయాన్ని కుంగదీస్తున్నాయి. ఈ వెలితి తోనే మిగతా జీవితం ఉంటుందన్న కఠోర వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అర్థం చేసుకొంటున్నా. నువ్వు లేని లోటు ఉన్నప్పటికీ నేను ఇంకా నీ ప్రేమను పొందుతున్నాను. అదే నన్ను ఈ ఆవేదన నుంచి సంరక్షిస్తుందేమో అనిపిస్తోంది. కళ్లు మూసుకు న్న ప్రతిసారి నువ్వే కనిపిస్తున్నావు. నీతో పంచుకున్న మధుర క్షణాలే నా కళ్లముందు మెదులుతున్నాయి. దానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. ఎంతటి కష్టమైనా అంత పెద్దగా అనిపించేది కాదు. ఎందుకంటే నా కోసం నువ్వు ఉన్నావు. మా కోసం నువ్వు పడిన ఆరాటం ఇంకా మా కళ్లముందు మెదులుతోంది. మా జీవితాల్లో నువ్వు ఉండటం మేం చేసుకున్న అదృష్టం. నీ హృదయంలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ అనంతం. అందుకేనేమో ఆ దేవుడు నిన్ను త్వరగా తీసుకెళ్లిపోయాడు. ‘ఎల్లప్పుడూ నువ్వింత ఆనందంగా ఎలా ఉండగలుతున్నావు? అని నా స్నేహితులు అప్పుడప్పుడూ అడిగేవారు. నా ఆనందమంతా నీ వల్లే, నీ ప్రేమ వల్లేనని ఇప్పుడు అర్థమవుతోంది. నేను జీవితంలో ఇప్పటివరకూ ఎవరి మీదా ఆధారపడలేదు. ఆ అవసరం కూడా రాలేదు. ఎందుకంటే నాకు కావాల్సింది నువ్వే! నువ్వు నా ప్రాణస్నేహితురాలివి. ‘ఏదో ఒక రోజు నన్ను చూసి నువ్వు గర్వపడాలి’ అనే ఆశతోనే ప్రతిరోజూ నిద్రలేచేదాన్ని. ఇప్పుడూ అంతే. నువ్వు గర్వపడేలా ఉంటాను. ఎందుకంటే ఎప్పటికీ మాతోనే ఉంటావు. మాలో నిండిపోయావు. నీ ప్రభావం మా ముగ్గురి మీద (తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్) ఎంతో ఉంది. నువ్విచ్చిన మనోధైర్యంతోనే మేం ముందుకెళుతున్నాం. కానీ అది పూర్తిగా చాలదేమో. ఐ లవ్ యు మై ఎవ్రీథింగ్ ’’
![Image result for sridevi love towards jhanvi & khushi](https://o.aolcdn.com/images/dims3/GLOB/crop/3092x1548+0+0/resize/630x315!/format/jpg/quality/85/http%3A%2F%2Fo.aolcdn.com%2Fhss%2Fstorage%2Fmidas%2F18b8672d7afd874f0ab8cb7e5180e447%2F206164853%2Fboney-kapoor-sridevi-with-daughters-jhanvi-and-khushi-kapoor-during-picture-id628000698)
తన తల్లిదండ్రుల అన్యోన్యత గురించి కూడా ఆమె మరో పోస్ట్‌లో ప్రస్తావించారు. ఆ ఉత్తరం కూడా క్లుప్తంగా.... "నా పుట్టినరోజు (మార్చి 7) సందర్భంగా మీ అందర్నీ కోరేది ఒక్కటే. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. అలాగే, అమ్మ ఆత్మశాంతి కోసం ప్రార్థించండి. మా అమ్మ, నాన్నలు ఒకరినొకరు ఎంతో అర్థంచేసుకున్నారు. ప్రేమించు కున్నారు. దయచేసి వారిప్రేమని అపహాస్యం చేయవద్దు. వారి బంధాన్ని గౌరవించండి. నేను, మా చెల్లి ఖుషి తల్లిని కోల్పోయాం. కానీ నాన్న(బోనీ కపూర్) తన సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఓ తల్లిగా, భార్యగా, కథానాయికగా తన పాత్రలన్నిటినీ ఎంతో సమర్థవంతంగా పోషించింది మా అమ్మ. కేవలం ప్రేమ ను ఇవ్వడం, తీసుకోవడం ఒక్కటే ఆమెకుతెలుసు. ప్రపంచంలోని కుళ్లు, ఈర్ష్య అసూయల గురించి ఆమెకు తెలీదు. అర్థం కాదు కూడా. అలాగే మీ హృదయాలను ప్రేమతో నింపండి. కొన్ని రోజులుగా మీరు మా కుటుంబంపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు ఎంతో ఋణపడి ఉంటాం. ఇదే మాకు ఎంతో మనోధైర్యానిచ్చింది"
కానీ నాన్న బోనీ కపూర్ కూడా తన భార్య శ్రీదేవి అంత్యక్రియలు పూర్తైన తర్వాత ఓ లేఖను మీడియాతో పంచుకున్నారు. శ్రీదేవి అందరికీ చాందిని కావొచ్చని, కానీ తనకు మాత్రం ప్రేమమూర్తి అని గుర్తుచేశారు. తన ఇద్దరు కుమార్తెలకు ఆమేసర్వస్వం అని తెలిపారు. తమ జీవితాలు ఎప్పటికీ మునపటిలా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు.
![Image result for sridevi love towards jhanvi & khushi](http://www.bollywoodlife.com/wp-content/uploads/photos/2016/12/849938.jpg)