సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ సినిమా 1985 కాలం నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏ పాత్ర ఎక్కడా తగ్గకుండా అద్భుతంగా తీర్చి దిద్దారు. హీరో రాంచరణ్ చిట్టిబాబు గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చరణ్ నటకు ప్రశంసలు వస్తున్నాయి. ఇక సమంత కూడా పల్లెటూరి అమ్మాయిగా ఎంతో నేచురల్ గా నటించింది. తన కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయడం తన అదృష్టం అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.
ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రలో నటించింది యాంకర్ అనసూయ. ఇప్పటికే తన గ్లామర్‌తో బుల్లితెరను, సోషల్ మీడియాను హీటెక్కించిన అనసూయ పల్లెటూరి నేపథ్యంలో సాగే 'రంగస్థలం'లో రంగమ్మత్త నటించింది. రంగమ్మత్త పాత్రలో ఆమె ఎంతగానో ఒదిగిపోయిందని ప్రేక్షకుల ప్రశంసలతో అనసూయ ఆనందపడిపోతోంది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరెవ్వరినీ ఎలా అయితే ఊహించుకోలేమో, రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తపాత్రలో తనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమని చాలా మంది అభిమానులు అంటున్నారని, ఈ ప్రశంసలు తనకు చాలని చెప్పింది. ఇప్పటి వరకు బుల్లితెరపై తన ప్రతిభ నిరూపించుకున్న అనసూయ ‘రంగస్థలం’ లో తన నటనతో అందరి మనసు దోచింది.
రంగమ్మత్త పాత్ర ఎంతో ఒదిగి ఉండే స్వభావం అని..తాను కూడా పరిస్థితులకు అనుగుణంగా ఒదిగి ఉండే మనస్థత్వం కలదానిని కనుకనే ఆ పాత్రలో అంతగా లీనమైనానని తెలిపింది. ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఆదరించి, విజయం చేకూర్చిన ప్రేక్షకులను తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అనసూయ చెప్పింది.
![](https://www.ap7am.com/backimages/telugu-news/bigimages/tnews-ff2ae7228bec7316078ac75ca69f0b98b30073cb.jpg)