తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పాటు ఎస్వీ రంగారావు తో సమానంగా నటించి మెప్పించి అత్యధిక పారితోషికం తీసుకున్న నటి సావిత్రి. కేవలం తన కళ్లతోనే ఎంతటి సన్నివేశాన్నైనా పండించగల గొప్ప నటి సావిత్రి..అందుకే ఆమెను మహానటి అన్నారు. అలాంటి గొప్ప నటి చివరి రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డట్లు వార్తలు వచ్చాయి..అయితే ఈ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రంలో అలాంటి ఇబ్బందులు ఏవీ చూపించలేదు.
కాకపోతే ఆమె తాగుడికి బానిస కావడం మాత్రం చూపించారు. కానీ, సావిత్రికి ఆరోగ్యంతో పాటు ఆమెకి అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలను పోషించారు. సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..దర్శకరత్న దాసరి నారాయణ రావు వద్ద తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవాడినని..ఆ సమయంలో ఎన్టీఆర్ నటించిన ‘సర్కస్ రాముడు’ చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఒక చిన్న పాత్ర కోసం సావిత్రి గారికి 6 వేల రూపాయల పారితోషికాన్ని ఫిక్స్ చేశారు.
బెంగుళూరు ప్యాలెస్ లో ఓ షూటింగ్ లో ఆమె పాల్గొనాల్సి ఉంది..ఆ సమయంలో ఆమె నా వద్దకు వచ్చి తమ్ముడూ..నేను వచ్చి నాలుగు రోజులు అవుతుంది..రోజూ మేకప్ వేయించి నన్ను వెయిట్ చేయిస్తున్నారు..తర్వాత షాట్ లేదని అంటున్నారు. ఈ విషయం నాకు ముందుగా చెబితే నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్పారు..ఆ సమయంలో అంత గొప్ప నటికి ఏంటీ పరిస్థితి అని నా కళ్లు చెమ్మగిల్లాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.