![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/f2-mixing-415x250.jpg)
ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఎఫ్ 2 మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అదిరిపోయే కామెడీతో ఇంటిల్లిపాదీని ఆకర్షిస్తూ సంక్రాంతి సందడి సృష్టిస్తోంది. మొగుడూ పెళ్లాల గిల్లి కజ్జాలనే ఓల్డ్ కాన్సెప్టునే మళ్లీ చక్కగా తిరగమోత పెట్టి సక్సస్ కొట్టేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈ సినిమాలో పెద్దగా కథ లేదని.. కథనంపైనే ఎక్కువగా దృష్టిపెట్టానని డైరెక్టర్ అనిల్ రావిపూడే చెబుతున్నాడు. తనకు జంధ్యాల, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులు అంటే ఇష్టమంటున్న అనిల్.. వారి స్ఫూర్తితోనే ఈ సినిమా తెరకెక్కించానంటున్నాడు. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా గతంలో వచ్చిన పెళ్లాం చెబితే వినాలి’, క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. వంటి సినిమాల నుంచి తీసుకున్నదేనట.
అనిల్ రావిపూడికి గుండమ్మ కథ అంటే పిచ్చి అట. ఇప్పటికే వరుసగా మూడు యాక్షన్ సినిమాలు తీసిన అనిల్.. వెరైటీ కోసం ఈసారి కామెడీ బాటపట్టాడట. సో.. పెళ్లాం చెబితే వినాలి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, గుండమ్మ కథ.. ఈ మూడు కలిపి ఈ ఎఫ్ 2 వంటక వండేశాడన్నమాట.
కామెడీ ఎంటర్టయినర్ కు పెద్దగా స్టోరీ అవసరం లేదంటున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటిదాకా కథకి ప్రాధాన్యం ఉన్న సినిమా చేసే అవకాశం తనకు రాలేదంటున్నాడు. అలాంటి సినిమా వచ్చినప్పుడు కథ కోసం ప్రాణం పెడతానంటున్నాడు ఈ కొత్త కుర్రాడు.