తమిళనాడు రాజకీయాల్లో భారీ శూన్యత ఉంది. ఆ రాష్ట రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి ఇద్దరూ ఒకేసారి నిష్క్రమించడంతో ఆ ఖాళీ ఏర్పడింది. దాన్ని పూరించేందుకు ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్ పార్టీలను పెట్టుకున్నారు. కానీ వీరి పార్టీల ప్రభావం అంతగా కనిపించడంలేదు.
ఈ సమయంలో మరో స్టార్ హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనే హీరో అజిత్. ఆయన తనకు రాజకీయాలంటే అంత ఆసక్తి లేదని ఇప్పటికే ప్రకటించేశాడు. కానీ ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారు పెరుగుతున్నారు. తాజాగా ఓ దర్శకుడు ఆయన తమిళ ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఆ దర్శకుడే సుశీంద్రన్. ‘40 ఏళ్ల ద్రవిడ రాజకీయాల్లో మార్పు రావాలంటే అది నీ వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. తమిళనాడు ప్రజల కోసం మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుతున్నా. మీకు ఇదే సరైన సమయం. ముందడుగు వేయండి. అని ఆ పోస్ట్ లో అజిత్ ను ఆహ్వానించాడు.
రాజకీయాల్లో మీ రాక కోసం ఎదురుచూస్తున్న కోట్లాది అభిమానుల్లో నేనూ ఒక్కడ్ని అంటూ సుశీంద్రన్ చెప్పుకొచ్చారు. మరి ఇంతకూ అజిత్ ఇలాంటి ఆహ్వానాలు మన్నిస్తారా..లేదా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలా పిలిపించుకోవడం కూడా ఓ వ్యూహమా అన్నది ఆలోచించాల్సిన విషయమే.