కరోనా లాక్‌డౌన్‌.. అందరికీ కావాల్సినంత సమయం ఇచ్చింది. ఆకాశమంత ఎత్తులో ఉన్నవాళ్లను కూడా... నేల మీదకు తీసుకొచ్చింది. ప్రకృతి రమణీయత ఎంత గొప్పదో చాటి చెప్పింది. అందులో భాగంగానే.. ఓ బాలీవుడ్‌ యాక్టర్‌ రైతుగా మారిపోయాడు. 

 

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడంలోనే మనిషి గొప్ప గుణం బయటపడుతుంది. డౌన్‌ టు ఎర్త్‌ అనే మాటకు అసలైన అర్థం కూడా ఇదే. దీన్నే నిజం చేసి చూపించాడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. బాలీవుడ్‌లో క్రేజీ యాక్టర్‌గా పేరున్న నవాజ్‌.. ఇలా సాదాసీదాగా జీవితం గడిపేస్తున్నాడు. రైతుగా మారి సేద్యంలో సేదతీరుతున్నాడు. 

 

సాధారణంగా సినిమాల్లో హీరోలు ఇలాంటి సన్నివేశాల్లో కనిపిస్తుంటారు. బహుశా, ఇది కూడా అలాంటి సీనే అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. ఇది రీల్‌ లైఫ్‌ సీన్‌ కాదు.. రియల్‌ లైఫ్‌లో వీడియో. లాక్‌డౌన్‌ టైమ్‌ను నవాజుద్దిన్‌ ఇలా సింపుల్‌గా స్పెండ్‌ చేస్తున్నాడు. రైతు అవతారం ఎత్తి.. పార చేతబట్టి పొలంలో పనులు చేస్తున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

 

పొలం దగ్గర పనులు ముగించుకుని.. కాలువలో నవాజ్‌ చేతులు కడుక్కుంటున్న దృశ్యాన్ని వీడియోలో చూడొచ్చు. తలకు కండువా కట్టుకుని, భుజంపై పార పెట్టుకున్న ఈ వీడియోను.. తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు సిద్ధిఖీ. దానికి డన్‌ ఫర్‌ ది డే.. అంటూ.. ఈ రోజుకు పని పూర్తయ్యింది అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ జోడించాడు. 

 

కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన సెలబ్రిటీలు... ఇంట్లో పనులు చేయడం, జిమ్‌లో కసరత్తులు చేయడంపై దృష్టిపెట్టారు. వాటన్నింటినీ వీడియోలుగా మలిచి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ మాత్రం.. ఇలా మట్టిబిడ్డగా మారిపోయాడు. డౌన్‌ టు ఎర్త్‌ అనే మాటకు అర్థం చెప్పాడు.

 

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సొంతూరు యూపీలోని బుధానా. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు ఆగిపోవడంతో..  అక్కడికి వెళ్లిన నవాజ్‌... ఈ గ్యాప్‌ను రకరకాలుగా గడపాలని ప్లాన్‌ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన ఐదుగురు యాక్టర్ల సినిమాలు.. ఐదుచొప్పున రోజూ చూడాలని ప్లాన్‌ చేసుకున్నాడు. అది కాస్తా పూర్తయ్యాక.. ఇలా పార పట్టుకున్నాడు. తాను ఇదివరకు చేసిన వ్యవసాయంలోనే మళ్లీ నిమగ్నమయ్యాడు.

 

నిజానికి నవాజుద్దిన్‌కు వ్యవసాయమంటే చాలా ఇష్టమట. సినిమాల్లోకి రాకముందు.. ఇరవై ఏళ్ల పాటు ఆయన చేసిన పనికూడా ఇదే. అందుకే లాక్‌డౌన్‌ టైమ్‌లో.. ఏమాత్రం ఆలోచించకుండా మళ్లీ రైతు అవతారం ఎత్తాడు. తన పాతరోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఈ యాక్టర్‌ చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రైతుగా మారిన నవాజుద్దిన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కదా డౌన్‌ టు ఎర్త్‌ అంటే.. అని ఒకరు కామెంట్‌చేస్తే.. మీరెంతో మందికి ఆదర్శం అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

 

2016లో ఇలాంటి ఫొటోనే ఒకటి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు నవాజ్‌. తన కుటుంబానికి చెందిన పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతూ కనిపిస్తాడు. చాలా సార్లు తనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని చెప్పిన నవాజ్‌.. ఇప్పుడు లాక్‌డౌన్‌ టైమ్‌ని తనకు నచ్చినట్టుగా పొలం గట్లపై ఎంజాయ్‌ చేస్తున్నాడు.

 

గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాస్సేపూర్‌, బద్లాపూర్‌, రమన్‌రాఘవ్‌ వంటి సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్లతో అలరించిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ.. ఇటీవల ఘూమ్‌కేటు సినిమాలో అలరించాడు. ఈమధ్యే భార్య అలియా సిద్ధిఖీ నుంచి విడాకుల నోటీసులు అందడంతో నవాజ్‌ వార్తల్లో నిలిచాడు. వీళ్లిద్దరికీ 2009లో వివాహం కాగా.. కూతురు షోరా, కుమారుడు యానీ ఉన్నారు. అయితే,మనస్పర్దలు రావడంతో భార్యభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: