తెలుగు ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇరాన్ దేశస్తుడనుకుని శ్రీనివాస్ ను కాల్చానని నిందితుడు ఆడమ్ ప్యూరింటన్(51) కోర్టుకు తెలిపాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం అభియోగాలు అతడిపై నమోదు చేశారు.కాల్పులు జరిపిన తర్వాత ప్యూరింటన్ 70 మైళ్ల దూరం పారిపోయారు. క్లింటన్ లోని ఆపిల్ బే రెస్టారెంట్ కు వెళ్లి బార్ అటెండర్ కు హత్య విషయం చెప్పాడు.
తమతో పాటు ఉంటానని ప్యూరింటన్ అడిగాడని, దీనికి ఒప్పుకుంటేనే ఏం జరిగింది చెప్తాననన్నాడని బార్ అటెండర్ తెలిపాడు. తాము సరేననడంతో జరిగిందంతా చెప్పాడని వెల్లడించాడు. తాను వెంటనే 911 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్యూరింటన్ ను అరెస్ట్ చేసినట్టు చెప్పాడు. ప్యూరింటన్ కోరిక మేరకు అతడి తరపున వాదించేందుకు న్యాయవాదిని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి నియమించారు. 2 మిలియన్ డాలర్ల బాండుతో అతడిని జైలుకు పంపారు. 5 నిమిషాల్లో విచారణ ముగిసింది. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేశారు.