ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఘనంగా నిర్వహించారు. కువైట్‌లోని ఎస్వీఎస్ కార్గో ఆఫీసు ప్రాంగణంలో గురువారం చంద్రబాబు 68వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం -కువైట్ శాఖ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమంలో ప్రసంగించిన సుధాకరరావు ఎన్టీఆర్ ఆదర్శంగా, చంద్రబాబు స్ఫూర్తితో కువైట్‌లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కనీసం రాజధాని కూడా లేకుండా విడిపోయిన ఏపీని పరిపాలన చాతుర్యంతో అగ్రస్థానంలో నిలపడానికి చంద్రబాబు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు.
ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత ఇంద్ర కుమార్ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటం తెలుగువారి అదృష్టమన్నారు. ఆయన రాష్ట్రాన్ని చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలుపుతారనీ, 2019లో కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవాస కాపు బలిజ సేవా సంఘం అధ్యక్షులు, తెలుగు కువైట్ వెల్ఫేర్ కో.ఆర్డినేటర్ మురళి, పీఆర్వో ఈశ్వర్ నాయుడు, మీడియా కో ఆర్డినేటర్ రవికుమార్, గల్ఫ్ వైడ్ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు వేగి వెంకటేష్, నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు పట్టాభిరామ, ఆంధ్రాయూత్ కార్యవర్గ సభ్యులు, తెలుగు దేశం- కువైట్ సభ్యులు సుబ్బారెడ్డి, ముస్తాక్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు