అగ్రరాజ్యం అమెరికాతో నెలకొన్న పొరపొచ్చాలకు చెక్ పడింది. భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో బుధవారం విదేశాంగమంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో కొద్దిసేపు సమావేశమైన ఆయన...విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో విస్తృతంగా సంప్రదింపులు జరపనున్నారు. టెర్రరిజం, హెచ్-1 బీ వీసా, ట్రేడ్, రష్యాతో భారత్ ఆయుధ కొనుగోళ్లు, ఇరాన్ పై అమెరికా ఆంక్షలు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం వంటి వివిధ అంశాలపై ఆయన చర్చించనున్నారు. తాజా ఎన్నికల్లో మోదీ ఘన విజయం సాధించి ప్రధాని అయ్యాక ఓ విదేశం నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇండియాను సందర్శించడం ఇదే మొదటిసారి.
జపాన్‌లోని ఒసాకాలో త్వరలో జరగనున్న జీ-20 సమ్మిట్ సందర్భంగా మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో మైక్ భారత సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ‘ హద్దులు చెరిగిపోవాలని తమ దేశం కోరుతోందని, అలాగే హెచ్-1 బీ వీసాల విషయంలో భారత అభ్యర్థనలను తాము పరిగణనలోకి తీసుకుంటామని మైక్ ఈ చర్చల్లో స్పష్టం చేశారు. అటు-జయశంకర్, మైక్ మధ్య చర్చలకు అజెండా అంటూ ఏదీ లేదని దౌత్య వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ఇండియా ఎస్-400 మిసైల్ సిస్టంలను కొనుగోలు చేసేందుకు 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయాన్ని పాంపియో ఢిల్లీ నేతలతో జరిపే చర్చల్లో ప్రస్తావించారు. అదే సమయంలో భారత వైఖరిని కూడా జయశంకర్ ఆయనకు వివరించారు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణుల కొనుగోలు విషయమై గతంలో తాము నిర్దేశించుకున్న విధానానికనుగుణంగా ముందుకే వెళతామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పింది. వివిధ దేశాలతో సంబంధాల విషయమై తమ దేశ ప్రయోజనాలే ప్రధానమని తెలిపింది.
ఇటీవలి కాలంలో అమెరికా-భారత్ మధ్య ‘ టారిఫ్ వార్ ‘ కొనసాగుతోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారత్ సుంకాలు పెంచడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియాను ఆయన ‘ టారిఫ్ కింగ్ ‘ అని ఆ మధ్య అభివర్ణించారు. కాగా, పాంపియో రాకతో అమెరికాతో భారత వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. మోదీతో పాంపియో భేటీ అయిన దృశ్యాలను ఆయన ట్వీట్ చేశారు.