అగ్రరాజ్యం అమెరికాలోని మనవాళ్లకు కీలక శుభవార్త. లక్షలాది భారతీయ నిపుణులకు మేలు చేసే నిర్ణయం వెలువడింది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డుల జారీకి ప్రస్తుతం అనుసరిస్తున్న దేశాల కోటా పద్ధతిని ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు మంజూరు చేసే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఒక్కో దేశానికి గరిష్ఠంగా ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వకూడదన్న నిబంధనలు తాజాగా తొలగిపోవడంతో... దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు లభించనున్నాయి.
అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులను జారీ చేస్తోంది. ఆయా దేశాల జనాభాతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి అమలు చేస్తోంది. దీని వల్ల భారత్-చైనాలకు చెందిన వారికి నష్టం కలుగుతోంది. దీంతో తాజా బిల్లు తెరమీదకు వచ్చింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే 7 శాతం కోటా పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్‌ను రిపబ్లిక్ సభ్యుడు మైక్ లీ, డెమోక్రటిక్ సభ్యులు కమలా హ్యారిస్ సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇలాంటిదే మరో బిల్లును కాంగ్రెస్ సభ్యులు జో లోఫ్‌గ్రెన్, కెన్ బక్‌లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. తాజాగా ఆమోదం పొందింది. హెచ్1బీ వీసాలతో అమెరికాకు వచ్చి గ్రీన్‌కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఆమోదంతో మేలు జరుగుతుంది.
ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం హెచ్ 1బీ ఉద్యోగులు 151 ఏళ్లుగా అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత వలసదారులకు ఏడాదికి 140000 గ్రీన్ కార్డులను ఇస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. అమెరికా ఇచ్చే గ్రీన్ కార్డులు ఒక దేశానికి 7 శాతం కంటే మించకూడదని ప్రస్తుత చట్టాలు చెబుతున్నాయి. ఈ నిబంధనలతో తక్కువ జనాభా కలిగిన దేశాల వాళ్లకు మాత్రం కొన్నేళ్లలోనే శాశ్వత నివాస అనుమతి లభిస్తోంది. అయితే, భారత్- చైనా లాంటి దేశాల పోస్ట్ గ్రాడ్యూయేట్లు గ్రీన్‌కార్డు పొందాలంటే కనీసం 50 ఏళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా ఆమోదంతో ఈ సమస్యలకు చెక్ పడనుంది.