పాకిస్తాన్ కు కశ్మిర్ పరిసర ప్రాంత అభివృద్ధి ఏమాత్రం మింగుపడడం లేదని విదేశాంగమంత్రి జైశంకర్ మండిపడ్డారు. కశ్మీర్ లోయ, సరిహద్దుపై కన్నేసిన పాక్ చర్యలను ఆయన ఆక్షేపించారు. కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయం పాక్ కుయుక్తులకు విరుద్ధంగా ఉందని అన్నారు. అందుకే విషం చిమ్ముతున్నారంటూ పాక్ వైఖరిని విమర్శించారు. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇన్నాళ్లు కశ్మీర్ చాలా వెనకబడిందని తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే కశ్మీర్లో ఆంక్షలు విధించామని విదేశాంగమంత్రి జైశంకర్ వివరించారు.
గత అనుభవాలను పరిగణనలోకి తీసుకునే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. 2016లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు మొబైల్, అంతర్జాల సేవలు దుర్వినియోగం అయ్యాయని.. అల్లరి మూకలు హింసను ప్రోత్సహించడానికి వాడుకున్నారని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకునే నిషేదాజ్ఞలు విధించాల్సి వచ్చిందని తెలిపారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్లో ఉన్న జైశంకర్ అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో ఆంక్షలు వీలైనంత త్వరగా ఎత్తివేయాలంటూ ఇటీవల అమెరికా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైశంకర్ అమెరికా గడ్డపైనే వాటికి సమాధానం ఇవ్వడం గమనార్హం. భారత్ తీసుకున్న ఏ నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి కాదని.. దీని వల్ల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందలేదని వివరించారు. ఈ నేపథ్యంలోనే అధికరణ 370ని రద్దు చేయాల్సి వచ్చిందన్నారు.