అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు ప్రవాస భారతీయులు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. టెక్సాస్ లోని ప్రిస్కోలో జరిగిన ఈ ప్రమాదంలో రాజా గవిని(42), దివ్య ఆవుల(34), ప్రేమ్‌నాథ్‌ రామనాథం(42) మృతి చెందారు. ముగ్గురిలో దివ్య ఆవుల, రాజా గవిని హైదరాబాద్ కు చెందినవారని సమాచారం. ఎఫ్ఎం 423 ఇంటర్‌సెక్షన్‌ దగ్గర వేగంగా వచ్చిన కారు వీరి కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో దివ్య ఆవుల కారు నడుపుతున్నట్టు ప్రిస్కో పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు ప్రిస్కోలోనే నివశిస్తున్నారు. ఢీ కొట్టిన కారు డ్రైవర్ మైనర్ అని తెలుస్తోంది. 
 
మృతులలో దివ్య ఆవుల, రాజా గవిని హైదరాబాద్ లోని ముషీరాబాద్ గాంధీనగర్ కు చెందినవారు. ప్రిస్కో పోలీసులు గాంధీ నగర్ పోలీసులకు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. నిన్న ఉదయం ఒక పార్టీకి భార్యాభర్తలు, వారి స్నేహితుడు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ నగర్ పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: