ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో నిన్నటికి 11,500 కేసులు నమోదయ్యాయి. దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా... దుకాణాలు మూసి ఉండటంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో భారతీయ దుకాణాలు మూసి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా కట్టడిలో భాగంగా అమెజాన్, యాపిల్, ఫేస్ బుక్, గూగుల్ ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తోంది. న్యూయార్క్ లో రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో అధికారులు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. సిలికాన్ వ్యాలీగా పిలిచే శాన్‌ఫ్రాన్సిస్కో, శాన్‌జోస్ (కాలిఫోర్నియా) పూర్తిగా మూతబడ్డాయి. న్యూయార్క్ లో అత్యధికంగా 4,152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారతీయులు ఎక్కువగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే దుకాణాలు మూసేయడంతో నిత్యావసర వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కాలిఫోర్నియా గవర్నర్ ను కోరారు. తెలుగు అసోసియేషన్లు అమెరికాలో ఉండే తెలుగు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నాయి. అమెరికా తెలుగు అసోసియేషన్ స్వదేశానికి వెళ్లాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించింది.