సౌదీ అరేబియా దేశంలోని పవిత్రమైన మక్కా నగరంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కోవిడ్ 19 వ్యాధితో 13 రోజుల పాటు పోరాడి బుధవారం రోజు మృత్యువాత పడ్డాడు. ఈయన మృతితో ఇప్పటివరకు తెలంగాణాకు చెందిన ఇద్దరు యువకులు ఒక్క పవిత్రమైన మక్కా నగరంలోనే చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా దేశం మొత్తంలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎన్నారైలు చనిపోయారు.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నగరానికి చెందిన 33 ఏళ్ల మహమ్మద్ అమర్ గత కొన్ని రోజులుగా కోవిడ్ 19 వ్యాధి సోకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మక్కా నగరం లోని ప్రముఖ ఆసుపత్రికి చెందిన మెయింటనెన్స్ కంపెనీలో టెక్నీషియన్ గా గత 13 సంవత్సరాలుగా మహమ్మద్ అమర్ పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం మహమ్మద్ అమర్ పది రోజుల క్రితం కరోనా అనుమానితుడిగా హాస్పటల్లో జాయిన్ అయ్యాడు. అతడి పరిస్థితి విషమం కావడంతో... కోవిడ్ 19 వ్యాధిగ్రస్థులకు ప్రత్యేకంగా చికిత్స అందించే ప్రముఖ హాస్పటల్ కి అతన్ని తరలించారు అధికారులు. కానీ ఆ ప్రముఖ ఆసుపత్రి వైద్యులు కూడా అతనిని కాపాడలేకపోయారు. దాంతో మహమ్మద్ అమర్ దేశం కాని దేశంలో ప్రాణాంతకమైన కరోనా వైరస్ తో మృతి చెందాడు. ఈ విషాదకరమైన వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇకపోతే సౌదీ అరేబియాలో మహమ్మద్ అమర్ ని మినహాయించి ఇప్పటి వరకు ఇద్దరు ఎన్నారైలు కోవిడ్ 19 వ్యాధితో మరణించారు. వీళ్ళలో ఒకరు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి చెందిన వారైతే మరొకరు నిజామాబాద్ నగరానికి చెందిన వారు. ఇప్పటివరకు సౌదీ అరేబియాలో చనిపోయిన ముగ్గురు ఎన్నారైలు మెయింటెనెన్స్ కంపెనీలలోనే టెక్నీషియన్ల గా పని చేయడం గమనార్హం. ఈ ముగ్గురు ఎన్నారైల తో కలిపి సౌదీ అరేబియా లో 18 మంది తెలంగాణ వ్యక్తులు కోవిడ్ 19 వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. కాగా ఈ క్షణం వరకు సౌదీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24, 097 కి చేరుకోగా... 169 మంది కోవిడ్ మరణాలు సంభవించాయి.