అమెరికా వంటి అగ్ర దేశాల్లో మ్యారేజ్ అనేది చాలా చిన్న విషయం అనే చెప్పుకోవచ్చు. కానీ ఏ రాజ్యానికైనా రాజు ఒక్కడే ఉన్నప్పుడు రాణి కూడా ఒక్కటే ఉండాలి కదా ..! ఒకవేళ రాజు ఒకరి తర్వాత ఒకరు అలా ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మరి అధికారికంగా రాజు పక్కన ఏ రాణి కూర్చోవాలి అని చాలా మందికి సందేహం రావచ్చు.. అచ్చు అలాంటి సందేహమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంకకు వచ్చింది.
అమెరికా అధ్యక్షుడి సతీమణిని ‘ఫస్ట్ లేడీ’ అంటారు. వైట్ హౌస్‌లో ఆమెకు ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ ఉంటుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు సతీమణి గా ఉన్న మూడో భార్య మెలనియా ఫస్ట్ లేడీ ఎలా అవుతారు? అని ప్రశ్నించింది. తన తల్లికి దక్కవలసిన ‘ఫస్ట్ లేడీ’ టైటిల్ ను మారుతల్లి మెలనియాకు చెందకుండా ఉండటం కోసం ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్ పేరును ‘ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీస్’ గా మార్పించేందుకు చాలా ప్రయత్నాలే చేసిందట. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ మెలనియా అడ్డుకున్నట్టు ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పేరుతో మెలనియా జీవిత చరిత్రను రాసిన వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ మేరీ జోర్డాన్ తన పుస్తకంలో రాశారు.
అంతేకాదు ట్రంప్ కి ‘సింగిల్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ అడ్వయిజర్’ గా కూడా మెలనియాను జోర్డాన్ అభివర్ణించారు. అయితే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ పుస్తకం పై అనేక వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. నాణానికి ఒక వైపే కాదు రెండో వైపు కూడా చూడాలి అన్నట్టు ఆ పుస్తకంలో ఉన్నవని కేవలం కల్పితాలే అని కొట్టిపాడేసే వాళ్ళు ఉన్నారు. కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా సవతి పోరు అన్ని చోట్లా ఉంటుందని ఈ వార్త చదివిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు.