ముఖ్యంగా భారతీయ ఓటర్లని తమవైపుకు తిప్పుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ కమలా హరీస్ ని రంగంలోకి దించడంతో అందుకు కౌంటర్ గా ఐక్యరాజ్యసమితి లో అమెరికా మాజీ రాయబారిగా అలాగే రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న భారత సంతతి మహిళ నిక్కి హేలీ ని రంగంలోకి దించారు ట్రంప్. కమలా తరహాలోనే మాటల్లో చురుకుదనం, వాడి వేడి మాటలతో దూసుకుపోయే నిక్కి హేలీ డెమోక్రటిక్ పార్టీపై విరుచుకు పడ్డారు. అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికా పరువును తీసి అందుకు కారణం అధ్యక్షుడు ట్రంప్ అనడం డెమోక్రటిక్ పార్టీకి ముందు నుంచీ ఉన్న అలవాటేనని అన్నారు.
అమెరికాను జాత్యహంకార దేశంగా తూలనాడటంలో డెమోక్రటిక్ పార్టీ ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని ఆమె అన్నారు. వలస వాసులపై ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ చిన్న చూపు చూడలేదని, తనకి గవర్నర్ గా అవకాశం వచ్చిందని, మరి నేను వలస వాసుల కుటుంభం నుంచీ వచ్చాను కదా అంటూ నిక్కి హేలీ మండిపడ్డారు. నా కుటుంభం అమెరికాలో ఎంతో గౌరవ మర్యాదలు తీసుకుంటోంది. ఇక్కడ వారికి ఎలాంటి అవమానాలు కలుగలేదు. కొన్ని సంఘటనలును కావాలనే జాత్యహంకారానికి ముడిపెట్టడం మంచిది కాదని ఆమె తెలిపింది. నల్ల జాతీయుల మరణాల పట్ల మేము ఎంతగానో చింతిస్తున్నాము, వారికి తగిన న్యాయం జరుగుతుంది ..ట్రంప్ కి మరో సారి అధికారం ఇవ్వండి అంటూ నిక్కి హెలీ అమెరికన్స్ ను, ఇండో అమెరికన్స్ ని ఉద్దేశించి ప్రసంగించారు.