ఇండోనేషియాలోనే మూడో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం జకర్తా ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరింది. సూకర్నో-హట్టా విమానాశ్రయం నుంచి 59 మంది ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737-500 విమానం టేకాఫ్ అయింది. అప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ 4 నిమిషాలకే ఆ విమానంతో బేస్ స్టేషన్‌తో కనెక్టివిటీ కోల్పోయింది. ఒక్కసారిగా అకాశంలో నుంచి అదృశ్యమైపోయింది. దీంతో విమానం ఏమై ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది.
కాలిమంటన్ నుంచి పోంటియానక్‌కు వెళ్లే మార్గంలోనే విమానం కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. విమానం జాడను రాడార్ డేటా ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి రెస్క్యూ సిబ్బందిని కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమానాన్ని వెతుకేందుకు వెళ్లిన రెస్క్యూ సిబ్బందికి జకార్తా సముద్ర జలాల్లో ఆ విమానానికి సంబంధించిన శకలాలు లభ్యమయ్యాయి. దీంతో విమానం కూలిపోయి ఉంటుందనే ప్రాథమిక నిర్ధారణకు వారొచ్చారు. విమానంలో మొత్తం 59 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో ఐదుగురు చిన్నారులు, 54 మంది పెద్దలు ఉన్నారు. ఆరుగురు ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. కొద్ది నిముషాల్లో తమ కుటుంబ సభ్యులు వస్తారని ఆశిస్తున్న ప్రయాణికుల బంధువులు.. ఈ ప్రమాద విషయం తెలిసి హతాశులవుతున్నారు. ఎయిర్ పోర్టులోనే కుప్పకూలి రోదిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇండోనేషియాలో ఇలాంటి విమాన ప్రమాదాలు ఇటీవలి కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఇంతకుముందుకు కూడా జకార్తాలో ఇలాంటి విమాన ప్రమాదంలోనే 189 ప్రయాణికులు చనిపోయారు. పాత కాలంనాటి బోయింగ్ విమానాలను వినియోగించడమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దశాబ్దాల నుంచి సేవలందిస్తున్న ఈ విమానాల్లో ఆధునిక సేఫ్టీ ఫీచర్లు లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.