ఇక సైనా నెహ్వాల్ తన తండ్రి స్కూటర్ పై ప్రతిరోజు 13 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎల్బి స్టేడియానికి చేరుకునేవారు. పీవీ సింధు ప్రతిరోజు అకాడమీకి వెళ్లేందుకు ఏకంగా 30 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. దూరాభారాలు లెక్కచేయకుండా ఎంతో పట్టుదలతో బ్యాడ్మింటన్ ఆట లో నైపుణ్యం పొంది భారతదేశానికి ప్రతిష్ఠాత్మక పతకాలు తెచ్చిపెట్టిన ఈ క్రీడాకారుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
ఐతే ప్రస్తుతం బ్యాట్మెంటన్ వైపు అడుగులు వేస్తున్న యువ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, పుల్లెల గోపీచంద్ లను స్ఫూర్తిగా తీసుకొని వారి కంటే ఎక్కువ కృషి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కలలు సాకారం చేసేందుకు జాబులు, దేశాలు వదిలేయడానికి కూడా ఏమాత్రం సందేహించడం లేదు.
తాజాగా ముగ్గురు ఎన్ఆర్ఐలు తమ పిల్లలను హైదరాబాద్ నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్పించేందుకు గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి మకాం మార్చారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ లో గెలిచి.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 17 ఏళ్ల తనీషా క్రాస్టో తన తల్లిదండ్రులతో కలిసి మొన్నటి వరకు దుబాయ్ లో నివసించింది. ఆమెకు బ్యాట్మెంటన్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు దుబాయిలో పదేళ్లపాటు ఒక అకాడమీలో కోచింగ్ ఇప్పించారు.
అయితే తనీషా 10 సంవత్సరాల కాలంలో 400 మెడల్స్ గెలుచుకుంది. ఐతే తండ్రి క్లిఫోర్డ్ తన కూతురికి క్వాలిటీ ట్రైనింగ్ ఇప్పించాలని దుబాయి వదిలేసి ఇండియాకి వచ్చి పుల్లెల గోపీచంద్ అకాడమీ ని ఆశ్రయించారు. క్లిఫోర్డ్ తన కూతురు కోసం ఐటీ జాబ్ వదిలేశారు.
ప్రకాష్ కుర్బఖేల్గి అనే వ్యక్తి కూడా తన కూతురు సాక్షి కోసం జాబ్ వదిలేసి దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చేశారు. మరో యువ ఎన్ఆర్ఐ రాజట్రాజ్ రమేసన్(15) కూడా గల్ఫ్ దేశం నుంచి ఇండియాలో అడుగు పెట్టి తన కలలను సాకారం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.