హైదరాబాద్ కి చెందిన 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసి రూ .10 లక్షలకు పైగా డబ్బులు కొట్టేసాడు ఓ సైబర్ కేటుగాడు. బేగంపేటకు చెందిన బాధితురాలు కొద్ది నెలల క్రితం తన ప్రొఫైల్‌ను తెలుగు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఐతే గుజరాత్‌కు చెందిన ఒక మోసగాడు తనని తాను మేహుల్ కుమార్ గా పరిచయం చేసుకున్నాడు. ఎన్ఆర్ఐ గా నటిస్తూ తాను అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని తప్పుడు సమాచారం తన ప్రొఫైల్ లో పొందుపరిచి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తన వలలో వేసుకున్నాడు.


సైబర్ క్రైమ్ ఏసిపి కె.వి.ఎం ప్రసాద్ కథనం ప్రకారం.. ఫిర్యాదు చేసిన బాధితురాలు తన భర్త నుంచి కొంతకాలం క్రితమే విడిపోయారు. అలాగే ఆమెకు ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సైబర్ మోసగాడు తనను తాను అమెరికా సాఫ్ట్‌వేర్ ఎంప్లొయ్ అని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తన ఫోటోలు పంపించి తన అమ్మను తన కూతురును కూడా బాధితురాలికి పరిచయం చేశాడు. అలాగే గుజరాత్ లో కొన్ని ప్రాపర్టీస్ చూపించి అవి తనవేనని నమ్మబలికాడు. ఆ తర్వాత తనకు అమెరికాలో ఇల్లు ఉన్నట్టు బాధితురాలని మోసం చేశాడు. అనంతరం గుజరాత్ లో ఉన్న తన ఇంటిని రేనివేషన్ చేయాలని నిందితుడు మొదట రూ .1.5 లక్షలు కోరాడు. తరువాత వీసా ఏజెంట్‌కి రూ .1 లక్షకు పైగా బదిలీ చేయాలని చెప్పాడు. దీనితో ఆమె నిందితుడు బ్యాంక్ అకౌంట్స్ కి డబ్బులు పంపించారు.



ఆ తరువాత తాను భారతదేశానికి వస్తున్నానని చెప్పి.. నీ కోసం ఆభరణాలు, చెప్పులు, గడియారాలు, 50,000 డాలర్ల నగదు తెస్తున్నానని బాధితురాలికి చెప్పి.. వాటికి సంబంధించిన ఫోటోలు పంపించాడు. ఏప్రిల్ నెల ద్వితీయార్థంలో అతను ఆమెకు ఫోన్ చేసి పన్ను చెల్లించనందుకు కస్టమ్స్ అధికారులు వస్తువులను స్వాధీనం చేసుకున్నారని.. తనని అరెస్ట్ కూడా చేశారని తాను చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ .6 లక్షలు ట్రాన్సఫర్ చేయాలని అడిగాడు. దీనితో ఆమె అది నిజమేనని భావించి అడిగినంత డబ్బులు ఇచ్చేసారు. కానీ ఆ తర్వాత కూడా ఏదో ఒక కారణం చెప్పి డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. దీంతో అనుమానం వచ్చిన సదరు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.



ఎన్ఆర్ఐ ముసుగులో మోసానికి పాల్పడ్డ నిందితుడు 10 లక్షల రూపాయలకు పైగా బాధితురాలి నుంచి కాజేసాడని పోలీసులు కనుగొన్నారు. అలాగే సంబంధిత కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: