
తొమ్మిదేళ్ల ఇండియన్-అమెరికన్ ఆన్య కుమార్ సప్రా ఇండియాలో కరోనా పరిస్థితులను తెలుసుకుని చలించిపోయింది. కరోనా బాధితులకు తన వంతు అండగా ఉండాలని భావించిన ఈ చిన్నారి తాను నేర్చుకున్న కుకింగ్ స్కిల్స్ తో పలు రకాల స్వీట్స్(కప్ కేక్స్, చాకోలెట్ కేక్స్) తయారు చేసి విక్రయిస్తోంది. స్వీట్స్ విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బును జమ చేసి భారతదేశానికి అందించేందుకు ఈ చిన్నారి సిద్ధమయ్యింది. అయితే ఆ చిన్నారికి వచ్చిన ఆలోచన తెలుసుకొని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ చిన్నారికి సపోర్టుగా నిలుస్తున్నారు. కాగా, ఆన్య కుమార్ సప్రా ఆరేళ్ల చెల్లెలు శైల కూడా ఇండియాకి సహాయం చేసేందుకు కృషి చేస్తోంది.
ఆన్య, శైల తయారు చేస్తున్న స్వీట్స్ కి సంబంధించి స్థానిక ప్రాంతాల్లో బ్యానర్లు అతికించి ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఆన్య తన స్కూల్ లో కూడా స్వీట్స్ విక్రయిస్తోంది. ఆన్లైన్ ద్వారా కూడా ఆమె తన స్వీట్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. అయితే స్వీట్స్ అమ్మడం ద్వారా ఆమె ఇప్పటికే $4,400 (ఇండియన్ కరెన్సీలో 3,20,000) సంపాదించింది. ఈ మొత్తం డబ్బును ఒక చారిటీ సంస్థ కి ఇస్తానని.. ఆ చారిటీ సంస్థ భారతదేశంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని తాను నమ్ముతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా వయసులో చిన్నవారైనా పెద్ద మనసుతో గొప్ప సహాయం చేయడం నిజంగా అభినందనీయం.