అమెరికా దేశంలో భారతీయులు ఉన్నత పదవులు చేజిక్కించుకుంటున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె కన్న తక్కువ హోదాలలో ఎందరో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. అమెరికా ప్రజలను శాసించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరగడం సాటి భారతీయులుగా గర్వించదగిన విషయం. ఈ క్రమంలోనే మరొక తెలుగు మహిళ అమెరికా అధ్యక్షుడు నుంచి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.


తాజాగా అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ ఒక భారతీయ అమెరికన్ను అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలో ఫెడరల్‌ జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె పేరు నాగల సరళా విద్య కాగా.. ఆమె స్వచ్చమైన తెలుగువారు కావడం విశేషం. ప్రస్తుతం ఆమె పౌర హక్కుల న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఐతే సరళా విద్యను కనెక్టికట్ రాష్ట్రంలో ఫెడరల్ జడ్జి పదవికి జో బైడెన్ నామినేట్ చేశారు. ఒక తెలుగు మహిళను ఫెడరల్ జడ్జిగా నియమించాలని అధ్యక్షుడు సమాలోచనలు చేస్తుండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ఆమె పేరుని ప్రతిపాదించిన తర్వాత సెనేట్ కూడా ఆమోదముద్ర వేస్తే.. కనెక్టికట్ జిల్లా కోర్టు జడ్జి పదవిని అధిరోహించనున్న తొలి భారతీయ అమెరికన్ గా సరళ చరిత్ర లిఖించనున్నారు. ఐతే మన తెలుగు మహిళ సరళతో పాటు మరో నలుగురు వ్యక్తులను కూడా ఫెడరల్ కోర్టు జడ్జీలుగా నియమించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.



ఆమె న్యాయ వృత్తి ప్రస్థానం గురించి తెలుసుకుంటే.. ఆమె మొట్టమొదటిగా లాయర్ జస్టిస్ సుసాన్ గ్రాబెర్ దగ్గర క్లర్క్గా చేరారు. 2012వ సంవత్సరంలో యూఎస్ అటార్నీ ఆఫీస్ లో జాయిన్ అయిన సరళ.. హేట్‌ క్రైమ్స్‌ కోఆర్డినేటర్ గా చేశారు. అదొక్కటే కాదు యూఎస్ అటార్నీ ఆఫీస్ లో అనేక కీలక పదవుల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె 2008 సంవత్సరంలో కాలిఫోర్నియా యూనివర్శిటీలోని బర్కిలీ లా స్కూల్‌లో జ్యూరిస్‌ డాక్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఇక ఆమె 2017 నుంచి యూఎస్ అటార్నీ కార్యాలయంలో మేజర్ క్రైమ్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్గా కొనసాగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: