పాస్‌పోర్టు జారీ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ కేసులు ఉన్న వారికి కూడా పాస్‌పోర్టులు జారీ చేయడం వల్ల వారంతా హాయిగా  ఇతర దేశాలకు పారిపోయి విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. దీనివల్ల చాలా మంది నిందితులకు శిక్షలు విధించడానికి వీలు లేకుండా పోతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పాస్‌పోర్టు జారీకి పోలీసు విచారణ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ పోలీసుల విచారణ చాలా సందర్భాల్లో సరిగా జరగదు. దీనివల్ల క్రిమినల్ కేసులున్న వారు స్వదేశం నుంచి విదేశాలకు పారిపోవడానికి సులభతరం అవుతుంది.

అయితే ఈ సమస్యలకు కూడా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా వేలిముద్రలు ఇవ్వాలని ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాస్‌పోర్టు దరఖాస్తుదారుల వేలిముద్రల ద్వారా వారు గతంలో ఏమైనా నేరాలు చేశారా లేదా అనేది పోలీసులు పరిశీలించ బోతున్నారు. ఒకవేళ దరఖాస్తుదారులకు నేర చరిత్ర ఉంటే వారికి పాస్‌పోర్టు జారీ చేయరు. దరఖాస్తుదారుల వేలిముద్రలను పరిశీలించడమే సమర్థవంతమైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఐతే గత 2 సంవత్సరం కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వేలిముద్రలు పరిశీలించి 116 మందికి పాస్‌పోర్టులు రాకుండా నిరోధించగలిగారు.

ప్రస్తుతం ఎవరైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే.. వారి అడ్రస్ ప్రకారం స్పెషల్‌ బ్రాంచి పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా కలిసి విచారిస్తారు. అంతేకాకుండా దరఖాస్తుదారుడి చుట్టుపక్కల వారిని కూలంకషంగా విచారిస్తారు. అలాగే తమవద్ద ఉన్న క్రిమినల్ రికార్డులు పరిశీలించి.. ఆ సమాచారం అంతా సేకరించి పాస్‌పోర్టు కార్యాలయానికి ఒక డిటైల్డ్ రిపోర్ట్ పంపిస్తారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 20 రోజుల సమయం పట్టేది కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో 2-3 రోజుల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నారు. పోలీస్ కేసులు గాని నేరచరిత్ర గాని ఉంటే దరఖాస్తుదారులకు పాస్‌పోర్టు జారీ చెయ్యరు. అయితే దీనిపై అభ్యంతరం ఉన్న దరఖాస్తుదారులు కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ఫింగర్‌ప్రింట్స్‌ బ్యూరోలో సుమారు 6 లక్షల మంది నేర చరిత్ర గలవారి వేలిముద్రల డేటా అందుబాటులో ఉంది. గతంలో ఒక్కో వేలిముద్రను పరిశీలించాల్సి వచ్చేది. ఐతే పాపిలోన్‌ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి వేలిముద్రలను నిమిషాల వ్యవధిలోనే పోలీసులు విశ్లేషించగలుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: