కొద్ది రోజుల క్రితం యూఎస్, కెనడా, జర్మనీతో సహా పలు దేశాలు భారతీయ విద్యార్థుల కోసం ప్రయాణ ఆంక్షల్లో సడలింపులు ప్రకటించాయి. దీంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే వారంతా తమ ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో విద్యాసంస్థలు పునః ప్రారంభం కావడానికి సిద్ధమవుతున్నాయి. దీంతో తరగతులు మిస్ కాకూడదని యూనివర్సిటీలలో రిజిస్టర్ అయిన విద్యార్థులు విదేశాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా అమెరికా దేశానికి పోటెత్తుతున్నారు. దీనివల్ల ఒక్కసారిగా వసతి గృహాల కరువు ఏర్పడింది. భారతీయుల కంటే ముందుగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా అద్దె రూములలో దిగుతున్నారు. దీంతో ప్రస్తుతం అమెరికా కి వెళ్తున్న భారతీయ విద్యార్థులకు రూమ్‌లు దొరకడం చాలా కష్టంగా మారింది.



విద్యార్థులు తాము చదువుకోబోయే యూనివర్సిటీలకు సమీపంలో రూమ్స్ లభించకపోవడంతో ప్రస్తుతానికి ఎక్కడో ఒకచోట తలదాచుకుంటున్నారు. సాధారణంగా స్టూడెంట్స్ అమెరికా వంటి దేశాల్లో ఇతర విద్యార్థులతో కలిసి రూమ్‌లు షేర్ చేసుకుంటారు. దీనివల్ల వెంటనే రూమ్‌లు దొరకడం తో పాటు డబ్బు ఆదా అవుతుంది. కానీ ప్రస్తుతం షేర్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా విద్యార్థులతో రూమ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం వసతి లభించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్లింగ్టన్ లోని టెక్సాస్ యూనివర్సిటీలో అడ్మిషన్లు సాధించిన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.



అమెరికా దేశంలో కాలిఫోర్నియా తర్వాత అత్యధిక జనాభా గల టెక్సాస్ లో రూమ్‌లు దొరకడం అంత సులువైన పని కాదు అని అంటుంటారు. ఇక విద్యార్థుల హడావుడి నెలకొనడంతో రూములు దొరకడం మరింత కష్టతరంగా మారింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రయాణం ఆంక్షలు సడలించినప్పటికీ.. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వసతి సౌకర్యాలు కనిపించకపోవడం బాధాకరం. ఇక అమెరికాకి వెళ్లే విద్యార్థులు ముందస్తుగానే అందుబాటులో ఉన్న రూమ్ లను బుక్ చేసుకొని వెళ్తే ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: