రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్‌కు మూడు వైపులా మోహరించాయి. ఉక్రెయిన్‌ సరిహద్దులకు రష్యా తన యుద్ధ ట్యాంకులను తరలించింది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లోనూ రష్యా తన బలగాలను మోహరించింది. ప్రధానంగా డొనెట్స్‌క్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతాల్లో రష్యా బలగాలు ఇప్పటికే చేరుకున్నాయి.


దీంతో ఏక్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా సర్వసన్నద్ధంగా ఉంది. అయితే.. ఈ సంక్షోభాన్ని  పరిష్కారించుకునేందుకు ఉక్రెయిన్‌కు రష్యా మూడు షరతులు విధించింది. బలగాల మోహరింపును ఇప్పటికీ సమర్థించుకుంటున్న రష్యా ‌అధ్యక్షుడు పుతిన్‌... ఉక్రెయిన్‌లోని ఆయా ప్రాంతాలు సైనిక సాయం కోరినందుకే బలగాలు పంపామని వాదిస్తున్నారు.


అయితే.. రష్యా చర్యలను తీవ్రంగా ఖండించిన ఐరోపా దేశాలు.. ఆంక్షల విధింపు యోచనను పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే నాటో దేశాలు మాస్కోపై ఆంక్షలు కఠినతరం చేశాయి. అంతే కాదు.. రష్యా చుట్టుపక్కల దేశాల్లోకి నాటో దళాలు మోహరిస్తున్నాయి. ప్రధానంగా రష్యాకు పొరుగున ఉన్న బాల్టిక్‌ దేశాలకు అమెరికా తన యుద్ధ విమానాలను పంపింది. అమెరికాకు చెందిన 800 మంది సైనికులు, 40యుద్ధ విమానాలు బాల్టిక్ దేశాలకు చేరుకున్నాయి.


రష్యాతో యుద్ధం చేసే ఆలోచన లేదంటున్న అమెరికా.. కేవలం ఆత్మ రక్షణ కోసమే ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతోంది. ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధంగా అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ ఉన్నాయనే చెప్పాలి. రష్యా దూకుడుతో అప్రమత్తమైన ఉక్రెయిన్ కూడా రష్యాకు దీటుగా బలగాలను సిద్ధం చేసుకుంటోంది. ఆ దేశం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ముందు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామని.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని చెబుతున్నారు. ఇలా రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో వివిధ దేశాల బలగాల మోహరింపును చూస్తే.. యుద్ధం తప్పదేమో అన్న వాతావరణం కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: