అంతకుముందు ప్రధాని మోదీ జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌తో ముఖాముఖీ చర్చించారు. ముఖాముఖి తర్వాత ఇరు దేశాల ప్రతినిధుల సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఇండియాకు జర్మనీ ఓ శుభవార్త చెప్పింది. ఇండియాలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవటానికి భారీ సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ సంయుక్త ప్రకటనపై భారత్, జర్మనీలు నిన్న సంతకాలు చేశాయి.
భారత్‌లో అటవీ విస్తీర్ణం పెంపులో సహకారానికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై రెండు దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు సంతకాలు చేశారు. 2030 నాటికి కీలకమైన పర్యావరణ లక్ష్యాలు సాధించేందుకు భారత్‌కు సుమారు రూ.80,430 కోట్లు సాయం అందించాలని జర్మనీ నిర్ణయించింది. జర్మనీ కరెన్సీలో 1000 కోట్ల యూరోల సహాయాన్ని అదనంగా అందజేయనున్నట్లు జర్మనీ చెబుతోంది. ఈ నిధుల్లో 50 శాతం నిధులను పునరుత్పాదక ఇంధనాల కోసం కేటాయిస్తారు.
అలాగే వ్యవసాయ-పర్యావరణం, ప్రకృతి వనరుల సుస్థిర నిర్వహణకు కూడా జర్మనీ రూ.2412 కోట్లు రుణాలు భారత్‌కు ఇవ్వబోతంది. ఈ రాయితీపైనా భారత్‌తో జర్మనీ ఒప్పందం చేసుకుంది. గతేడాది 2021 డిసెంబరులో జర్మన్ ఛాన్స్‌లర్‌గా షోల్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో ప్రధాని మోదీ తొలి భేటీ ఇది కావడం విశేషం. ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీని జర్మనీలో జరిగే జి-7 సదస్సుకు ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానించారు.