ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం తాళిబన్ల పాలన నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని రూపుమాపి ఆయుధాలు చేత పెట్టి ఏకంగా ఎంతో మంది ప్రాణాలు తీసి అధికారాన్ని దక్కించుకున్న తాళిబన్ల ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రోజు రోజుకు తీసుకు వస్తున్న చట్టాలు ప్రతి ఒక్కరిని కూడా షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి. తాము మహిళల స్వేచ్ఛకు  వ్యతిరేకం కాదని.  తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు సమచిత స్థానం కల్పిస్తాము అంటూ చెప్పినా తాళిబన్లు.. ఆ తర్వాత మాత్రం తీసుకువచ్చిన నిబంధనలు ఏకంగా మహిళలను బానిసలుగా మార్చేస్తున్నాయి అని చెప్పాలి.


 మహిళ అంటే కేవలం వంటింటి కుందేలు మాత్రమే కాదు ఏ రంగంలో అయినా సత్తా చాటగలదు అని అక్కడ ఎంతో మంది మహిళలు నిరూపిస్తున్న సమయంలో.. తాళిబన్లు తీసుకువచ్చిన నిబంధనల కారణంగా వివిధ రంగాలకు చెందిన మహిళలందరూ కూడా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మహిళలకు స్వేచ్ఛగా చదువుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇలా తాళిబన్లు తీసుకుంటున్న నిర్ణయాలు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోతున్నాయి.


 ఇక ఇప్పుడు తాళిబన్ ప్రభుత్వం మరోసారి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆఫ్గనిస్తాన్ లో అన్ని బ్యూటీ పార్లర్లను మూసివేయాలి అంటూ తాళిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఇస్లాంలో నిషేధిత సేవలను బ్యూటీ పార్లర్లు అందిస్తూ ఉన్నాయి. దీంతోపాటు పెళ్లి సమయంలో అబ్బాయిలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఇక దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్లు మూసివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిర్ణయంతో దేశంలో సుమారు 60000 మంది ఉపాధి కోల్పోబోతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఆంక్షలు  ఎత్తివేసేందుకు ఆఫ్గనిస్తాన్ అధికారులతో మాట్లాడుతున్నట్లు ఐరాస తెలిపింది. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: