అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తల్లి మంత్రి కావడంతో.. జిల్లాలోని పార్టీ వ్యవహారాలను శ్రీరామ్  దగ్గరుండి చూసుకుంటున్నారు. ఐతే.. పరిటాల తనయుడు రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం సాగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తల్లి మంత్రి కావడంతో  అధికారమదంతో శ్రీరామ్  రెచ్చిపోతున్నారని అంటున్నారు. 

వైసీపీ నాయకులు ఆ స్థాయిలో ఆరోపణలు చేయడానికి నేపథ్యం ఉంది.  ఇటీవల అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా జల సాధన సమితి ఆధ్వర్యంలో  రామగిరి మండలం పోలేపల్లిలోసమావేశం ఏర్పాటు చేశారు. ఐతే పరిటాల శ్రీరామ్ అనుచరులు ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు రౌడీలను పంపారని.. వాళ్లు బీహార్ తరహాలో రాళ్లు, కట్టెలు పట్టుకుని రోడ్లపై నిలబడి భయానక పరిస్థితులను సృష్టించారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

రౌడీ రాజ్యం సాగనివ్వబోమంటున్న ప్రకాశ్ రెడ్డి  


అనంతపురం జిల్లాకు అన్యాయం చేస్తూ హంద్రీ-నీవా  నీటిని అక్రమంగా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని వైసీపీ నేత, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే హంద్రీ-నీవా జల సాధన సమితి చైతన్య యాత్ర చేపట్టారు. దీనికి ప్రజల నుంచి ఆదరణ పెరగడం వల్లే పోలేపల్లి సమావేశాన్ని అడ్డుకున్నారని ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. 

పరిటాల సునీత, శ్రీరామ్ ఒత్తిడి మేరకే ఈ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని ప్రకాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని అధికార దౌర్జన్యంతో అడ్డుకునేందుకు మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ చూస్తున్నారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో అన్నివర్గాల నుంచి టీడీపీకి వస్తున్న వ్యతిరేకతను చూసి జీర్ణించుకోలేక పరిటాల వర్గీయులు పోలేపల్లి సమావేశాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: