హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా సంచలన రేపిన మద్యం సిండికేటు కేసును ప్రభుత్వం మూసివేసినట్లు తెలుస్తోంది. ఎంతోమంది మద్యం వ్యాపారుల, రాజకీయ నాయకుల, మంత్రుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ కేసును మూసి వేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపెట్టినట్లు సమాచారం. అనేక ఒత్తిళ్లకు లొంగిన సర్కార్ చివరకు ఈ దిశగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా అనేక మంది ఏసీబీ అధికారుల ముఖ్యంగా అప్పట్లో ఈకేసును ప్రత్యేకంగా పరిశోధన చేసిన ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ రెడ్డి పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందనే చెప్పాలి. మద్యం కేసులో రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణకు సంబంధాలున్నట్లు ఏసీబీ అధికారులు నిగ్గును తేల్చారు. దీనితో బొత్సకు సీఎంకు మధ్య అగాధం పెరిగింది. ఈ పంచాయితీ ఢిల్లీ వరకు చేరింది. కాంగ్రెస్ పెద్దలు సీఎంను, బొత్సను కూర్చుండబెట్టి పంచాయితీని పరిష్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగానే అప్పటి ఏసీబీ అధికారి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. దీనితో ఢిల్లీ పెద్దలు కుదిర్చిన రాజీ ఫలంగా బొత్సకు ఊరట కలిగింది. తాజాగా ఈ కేసును పూర్తిగా మూసివేందుకు సర్కార్ నిర్ణయానికి రావడం అనేక మంది వ్యాపారులకు సంతోషాన్నికలిగిస్తోంది. అయితే, ఇదిల ఉండగా తాజాగా ఏసీబీ మరల మద్యం సిండికిట్లపై దాడులు మొదలుపెట్టింది. మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన కరుణాకర్ రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకుంది. చాలా రోజుల తరువాత ఏసీబీ అధికారులు దాడులు మొదలు పెట్టడంతో మద్యం వ్యాపారుల గుండెల్లో పరుగులెత్తిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: