ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ఇక  శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. 
 
మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. సాధారణంగా  శ్రీశ్రీ అనగానే పోటెత్తిన ఆవేశం గుర్తుకు వస్తుంది. పిడికిలి బిగిసిన చప్పుడు వినిపిస్తుంది. కవిత్వం త్రినేత్రమైన సందర్భాలు గుర్తుకు వస్తాయి.  కవిత్వంలో సరే, వ్యక్తిగతంగా శ్రీశ్రీ ఎలా ఉండేవారు?  రగులుతున్న అగ్నిపర్వతంలా ఉండేవారు! అని అనిపిస్తుంది గానీ ఆయనలో చల్లని చమత్కారం ఎక్కువ. సందర్భానుసారంగా హాస్యాన్ని పుట్టించడంలో శ్రీశ్రీ దిట్ట.

 

ఒక ప్రసంగంలో శ్రీశ్రీ చెప్పిన జోక్...
 ‘‘ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారనుకుంటాను. డాక్టర్ల మీద ఒక జోక్ ఉంది. ఇది నా జోక్ కూడా కాదు. కృష్ణశాస్త్రిగారిది. జోక్స్ అంటే నిజానికి హర్ట్ కాకూడదు. న్యాయంగా తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి. కాబట్టి..ఐ వుడ్ జస్ట్ లైక్ టు రీ టెల్ ఏ జోక్. ఆయన ఏమన్నారంటే -
 
‘ఏవండీ ఈమధ్య మీరు వైద్యం మానేసి కవిత్వం మొదలుపెట్టారట నిజమేనా?’ అని ఒక డాక్టర్‌ని అడిగితే..
 ‘అవునండీ నిజమే. వైద్యం మానేశాను. కవిత్వం రాస్తున్నాను’ అన్నాడట. ఆయన ‘సరే ఏదైతేనేంలెండి మనుషులను చంపడానికి’ అన్నాడట!’’

 

 
కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను శ్రీశ్రీకి పంపి "నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?" అని అడిగితే, "అబ్బే, నిప్పుల్లో నీ పద్యాలు కక్కేయ్ మిత్రమా" అని శ్రీశ్రీ సలహా ఇచ్చారట.  

 

 
గోపీచంద్ దర్శకత్వం వహించిన "పేరంటాలు" ప్రివ్యూ చూసి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య :
 
చూచితి పేరంటాలిని,
వాచెను, నా రెండు కనులు వలవల యేడ్వన్
లేచీ లేవక మునుపే
గోచి విడెను, ఏమనందు గోపీచందూ! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: