చైనా ఏంచేసినా.. ప్రతి అంగుళమూ మాదే.. 


భారతదేశంలో అంతర్భాగమైన నగరాలకు తిరిగి పేర్లు పెట్టే హక్కు చైనాకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రతి అంగుళం భారత్‌దేనని, అందులో వేలు పెడితే సహించేది లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గురువారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో టిబెట్‌ ఆధ్మాత్మిక గురువు దలైలామా పర్యటించిన విషయం తెలిసిందే. దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. దలైలామా పర్యటిస్తే భారత్‌తో తమ సంబంధాలు చెడిపోతాయని బెదిరించింది. అయినప్పటికీ భారత్‌ దలైలామా పర్యటనకు అనుమతించినందుకు ప్రతీకారంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు నగరాలను తమవే అని పేర్కొంటూ వాటికి ఆరు చైనా పేర్లు పెట్టి ప్రకటించింది. 


ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం..


అక్రమ కబేళాలపై నిషేధం, రోమియోల ఆటకట్టించేందుకు టీంల ఏర్పాటు, తదితర నిర్ణయాలతో ఇప్పటికే సంచలనంగా మారిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర స్థలాలుగా భావించే అన్ని ప్రదేశాల్లోనూ మద్య నిషేధం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది రోజులకే సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యూపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 8,544 మద్యం దుకాణాలను వేరే స్థలాలకు తరలించారు.

రవిశంకర్ పై గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం.. 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ‌ శ్రీ‌ రవిశంకర్‌పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తీవ్రంగా ఫైర్ అయ్యింది. యమునా నదీ తీరంలో నిర్వహించిన ‘ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం’ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడిందని కొంత మంది ఎన్‌జీటీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పండిట్ రవిశంకర్ ట్విట్టర్ ద్వారా నిన్న కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని అంశాలను పరిశీలించాకే కేంద్రం అనుమతిచ్చింది. 27 నదులను సంరక్షించి, 71 మిలియన్ల మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటు పడిన మాకు బాధ్యత లేదని అనడం విచారకరం. నదుల సంరక్షణపై అవగాహన పెంచడానికే.. యమునా నదీ తీరంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 


ఇంటిపేరు తెచ్చిన తంటా.. 

ఏ మాత్రం సంబంధం లేని కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబాన్ని, ఆయన రెండో కుమార్తె ప్రీతిష్రాఫ్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు.ప్రీతి ఇంటిపేరు ష్రాఫ్ కలిగిన మరో మహిళ చేసిన తప్పును సుశీల్ కుమార్ రెండో కుమార్తె చేసినట్టుగా భావించి నెటిజన్లను మేసేజ్ లు పెట్టారు. చిన్నపొరపాటు కారణంగా చేయని తప్పుకు సోషల్ మీడియాలో నెటిజన్లు సుశీల్ కుమార్ షిండే రెండో కుమార్తె ప్రీతిష్రాఫ్ బలైంది.సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు షిండే కుటుంబంలో కలకలం రేపాయి.చివరకు ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చిన వివరణ ఇవ్వడంతో తప్పుడు ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. 


పాక్‌ ప్రధాని అక్రమాస్తులపై విచారణ... 



అధికారాన్ని అడ్డంపెట్టుకొని దేశ విదేశాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని దాఖలైన కేసు (పనామా పేపర్ల లీక్)ను విచారించేందుకు సుప్రీంకోర్టు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జిట్)ను నియమించింది. ప్రధానమంత్రి అవినీతికి పాల్పడ్డారనడానికి బలమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన్ను ప్రధాని పదవి నుంచి తప్పించలేమని పేర్కొంది. నవాజ్ షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులు (ఇద్దరు కొడుకులు, కూతురు, అల్లుడు) అక్రమాస్తులు కల్గి ఉన్నారని సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. పనామా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం 540 పేజీల సుధీర్ఘ తీర్పును వెలువరించింది. ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. నవాజ్ షరీఫ్ సహా, ఆయన కుటుంబ సభ్యులు.. ‘జిట్’ విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: