ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం ఓ సంచలన కథనాన్ని బ్యానర్ గా ప్రచురించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రధాని మోడీ వద్దకు వెళ్లింది ప్రజా సమస్యలపై కాదని.. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించమని వేడుకోవడానికేనంటూ సంచలన కథనం ప్రచురించింది. అందుకు సాక్ష్యంగా ఓ లెటర్ లోని జగన్ సంతకం ఉన్న ఓ లేఖలోని భాగాన్ని ప్రచురించింది. 



ఈ కథనానికి అమ్మ జగనా అంటూ శీర్షిక పెట్టింది. ఇక తనదైన శైలిలో జగన్ తీరును పూర్తిగా ఎండగట్టేసింది. ఈ కథనం చూసి టీడీపీ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఈ దెబ్బతో జగన్ నోరు మూతబడుతుందని తల ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదని కామెంట్లు చేశారు. ఆంధ్రజ్యోతి కథనం చూసి వైసీపీ అభిమానులు కూడా కంగారు పడ్డారు. ఆధారాలు లేకుండా అంతటి కథనం రాయరు కదా అని భావించారు. 



కానీ సాయంత్రానికి సీన్ మారిపోయింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలో పాక్షికంగా నిజం ఉంది. ఆ లేఖ జగన్ రాసిందే. అందులోని సారాంశమూ అదే కానీ.. అది ఇప్పటిది కాదు.. ఫిబ్రవరి 17 నాడు రాసిన లేఖలోని ఓ భాగాన్ని చూపారు. ఈ లేఖను మొన్న ప్రధానిని కలిసినప్పుడు ఇచ్చినట్టుగా చూపించారని వైసీపీ ఆరోపిస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. 



అంతేకాదు ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరిస్తున్నామని కూడా ప్రకటించేసింది. ఇక ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగన్.. తాను ఆ లేఖను ఫిబ్రవరి 17నే రాశానని చెప్పారు. తాను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే, వాళ్ల దగ్గర నుంచి సమాధానం కూడా వచ్చిందని.. మే 10న నేను ప్రధానమంత్రిని కలిశానని చెప్పారు. బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లెటర్ తీసుకెళ్లి ఇస్తాడా అని ప్రశ్నించారు. మొదటి పేజీ చూపిస్తే తేదీ చూపించాల్సి వస్తుందని చివర పేజీ కథనంలో చూపారని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: