తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆర్కే నగర్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం రెండోసారి నోటిఫికేషన్ విడుదల చేయటం తెలిసిందే. గతంలో ఆర్కేనగర్ లో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నా..అక్కడ కొన్ని పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారని ఆరోపణలుతో ఈసి ఎలక్షన్ వాయిదా వేసింది. ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 21న పోలింగ్ నిర్వహించి, 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికలో హీరో విశాల్ పోటీ చేయడానికి సిద్దం అయ్యారు.
నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయన నామినేషన్ కు మద్దతుగా సంతకం చేసిన వారిలో ఇద్దరు తమ సంతకాలు ఫోర్జరీకి గురైనట్లుగా ప్రకటించటం.. తర్వాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో విశాల్ నామినేషన్ తిరస్కరించారు. ఓవైపు విశాల్ పోరాడుతుంటే.. మరోవైపు ఆయనకు మద్దతుగా నిలిచారు డీఎంకే ముఖ్యనేత స్టాలిన్. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూరులో పర్యటించిన సందర్భంగా స్టాలిన్ నోట కీలక వ్యాఖ్యలు చేశారు.
గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ ఈ బై పోల్ మళ్లీ రద్దు అవుతుందేమో.. అనే సందేహాలు వ్యక్తం చేశారు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ నేత ఎంకే స్టాలిన్. ఆర్కే నగర్ బై పోల్ లో విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడాన్ని స్టాలిన్ తప్పు పట్టారు. కుట్రపూరితంగానే విశాల్ నామినేషన్ ను తిరస్కరించారని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
ఈ బై పోల్ విషయంలో ఈసీ తీరును స్టాలిన్ తప్పు పట్టారు. విశాల్ నామినేషన్ వివాదంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకుంటే.. ఈ ఉప ఎన్నిక న్యాయంగా జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. తక్షణం ఆర్కే నగర్ బై పోల్ రిటర్నింగ్ అధికారిని మార్చాలని కూడా స్టాలిన్ డిమాండ్ చేశారు.