అమరావతి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఒక పట్టణము, ఇదే పేరుతో ఉన్న రెవిన్యూ మండలానికి కేంద్రము. ఇది గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరానికి కుడివైపున ఉంది. అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధమతం పరిఢ విల్లింది. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్టస్థానము పొందిన 'ఆంధ్రపురి' యే ధాన్యకటకం.
నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్ది వరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలు అందుకొంది. మరుగున పడిన చైత్య ప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. 'దీపాలదిన్నె' గా పిలువబడిన పెద్దదిబ్బను త్రవ్వి 1797లో మహాస్థూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ'
అమరావతి ధరణికోట పరిసరములలో మరియు చైత్యపు అట్టడుగు పొరల్లో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించాయి. క్రీ. పూ 4-3 శతాబ్దాలనాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు, స్తంభాలు వెలుగుచూశాయి. మౌర్యులకు పూర్వమే ఇచట నాగ, యక్ష తెగల జనపదం (గణతంత్ర రాజ్యం) ఉండేదని తెలుస్తోంది. బౌద్ధ భిక్షువు, చరిత్రకారుడు తారనాథుని ప్రకారము గౌతమ బుద్ధుడు ధరణికోటలో కాల చక్ర మండలాన్ని ఆవిష్కరించాడు. బహుశా ఈ కారణము వల్ల బుద్ధుని మరణానంతరము అమరావతి లో గొప్ప స్థూపనిర్మాణము జరిగి వుండవచ్చును.
మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, అనంద గోత్రీయులు, చాళుక్యులు, చోళులు, కోట వంశీయులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్-షాహి నవాబులు వరుసగా అమరావతి ధరణికోటను పాలించారు. క్రీ.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దము వరకు ధరణి కోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలక స్థానం వహించింది.
క్రీ.శ. 14 వ శతాబ్దం తర్వాత మరుగున పడిన చైత్య ప్రాశస్త్యం తిరిగి 18 వ శతాబ్దములో వెలుగు చూసింది. గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్థూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కోలిన్ మెకంజీ 1797 లో ఈ మహోన్నత సంపదను వెలికి తీసి రక్షణకు నాంది పలికాడు. అటు తర్వాత సర్ వాల్టర్ స్మిత్, రాబర్ట్ సెవెల్, జేమ్స్ బర్జెస్, అలెగ్జాండర్ రె, రాయప్రోలు సుబ్రహ్మణ్యం, వెంకట రామయ్య, కార్తికేయశర్మ మొదలైన పురాతత్వవేత్తలు, చరిత్రకారులు సాగించిన త్రవ్వకాలలో శిథిల మైన విచ్చిన్నమైన మహా చైత్యము బయటపడింది.
చైనా యాత్రీకుడు చరిత్రకారుడు 'హ్యూయెన్ త్సాంగ్' ఆరవ శతాబ్దములో అమరావతి స్థూపం సందర్శించటానికి వచ్చేసరికే భౌద్ధానికి భారత్ లో క్షీణదశ ప్రారంభమైనది. ఐతే క్రీ.శ.1344 వరకు పూజాపునఃస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల క్రీ.శ. 1700నాటికి భౌద్ధస్థూపం శిథిలావస్థకు చేరుకొంది. పెర్సీబ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో తన గ్రంధాలలో నిక్షిప్తం చేశారు.