ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచి 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. సాధారణంగా ఎమ్మెల్యే అయిన రోజును రాజకీయ పుట్టిన రోజుగా జరుపుకోవడం ఇంతకుముందు ఎన్నడూ లేదు. కానీ ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ కథనాలు ప్రచురించింది. అలా ఓ కొత్త సంప్రదాయానికి తెర తీసింది.
ఇక మిగిలిన మీడియా కూడా ఆంధ్రజ్యోతిని అనుసరించాల్సి వచ్చింది. ముందుగా ఆంధ్రజ్యోతి ఛానల్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత ఈటీవీ కూడా చంద్రబాబు 40 ఏళ్లరాజకీయ జీవితంపై ఇంటర్వ్యూ చేసింది. ఈ రెండు చానళ్ల తర్వాత చంద్రబాబు హైదరాబాద్ లో టీవీ9 కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో టీవీ9 చంద్రబాబు పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంలేదు.
దీనికి తోడు చంద్రబాబు వంటి సీనియర్ని ఇంటర్వ్యూ చేసే సమయంలో చేయాల్సిన కనీస గ్రౌండ్ వర్క్ టీవీ9 సీనియర్ రిపోర్టర్ మురళీ కృష్ణ చేసినట్టు కనిపించలేదు. మురళీ కృష్ణ అడిగే ప్రశ్నలకు చిర్రెత్తుకొచ్చిన చంద్రబాబు ఓ దశలో సహనం కోల్పోయారు. మురళీ కృష్ణపై మండిపడ్డారు. మురళీకృష్ణ అడిగిన కొన్ని ప్రశ్నల హేతుబద్ధత గురించి చంద్రబాబు కాస్త కోపంగానే సమాధానమిచ్చారు.
"స్టడీ చేయకుండా నేనేదీ మాట్లాడను. నువ్వూ అదే అలవాటు చేసుకోవాలి; నువ్వు మారవ్, నీ ఆలోచన తీరు మారదు, నీ మనసులో నెగటివిటీ పెరిగిపోయింది అంటూ చంద్రబాబు మురళీకృష్ణపై మండిపడ్డారు. నీ మైండ్ సెట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కు మారాలి, ఆ బురద లోంచి బయటికి రావాలి నువ్వు" అంటూ రెచ్చిపోయారు చంద్రబాబు. చంద్రబాబు ఇలా నేరుగా ఓ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడటం ఇదే తొలిసారి.