ఉన్నఊరిలో ఉపాధి కరువైంది ఉపాధిని వెతుక్కుంటూ రాష్ట్రం నుండి నిత్యం వేలాది మంది ఇతర రాష్ర్టాలకు, పట్టణాలకు వెలస వెళుతూనే ఉన్నారు. వ్యవసాయం తప్ప మరేమి తెలియని నిరుపేదలు తల్లిలాంటి ఊరును, పిల్లాపాపలను వదిలి పొట్టచేత బట్టుకుని పొరుగు రాష్ర్టాలకు వెళుతున్నారు. ప్రభుత్వ సహాయం ఏ మూలకు సరిపోకపోవడంతో కొందరు చేసిన అప్పులు తీర్చేందుకు, మరి కొందరు పొట్టకూటి కోసం వలస పోతున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామాలు ఖాళీ అవుతూనే ఉన్నాయి. . సాధారణంగా వేసివి కాలంలోనే వలసలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి వర్షాకాలంలోనూ వలసలు కొనసాగుతుండంతో పచ్చని పల్లెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిరక్ష్యరాస్యులైన నిరుపేద కూలీలు, చిన్నస్థాయి రైతులను ‘ముఠామేస్ర్తీ’లు తమ వలలో వేసుకొని ముంబై, చెన్నై, బెంగుళూరుతోపాటు ప్రత్యేక వాహనాల ద్వారా పలు రాష్ర్టాలకు తీసుకెళుతున్నారు. ప్రకృతి కన్రెర్ర జేయడం, వర్షాభావం, కరెంటు కోత, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇక తమ బతుకులు మారవని భావించి ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ వలస బస్సెక్కుతున్నారు. అయితే వలసలను నివారించేందుకు రాష్ర్టంలో గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను ప్రభుత్వం 200 దినాలకు పెంచిన ప్రయోజనం శూన్యం. దీంతో రాష్ర్టంలోని అనేక జిల్లాలోని మారుమూల గ్రామాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: