రాష్ట్ర విభజన కారణంగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం కాదని, పేరు ఏదైనా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఓ ఆంగ్ల వార్తా ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో తమ డిమాండ్లు నెరవేరే వరకూ భాజపాతో కలిసే అవకాశం లేదని, తాము తమసొంత దారిలో వెళ్తున్నామంటూ పేర్కొన్నారు. ఎన్నికల సమయానికి కూటమిలో చేరాలా? లేక సొంతంగా పోటీ చేయాలో నిర్ణయిస్తామన్నారు.
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టార్గెట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం ప్రభుత్వంపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తాను అకస్మాత్తుగా ఇప్పుడు ఆరోపణలు చేయడం లేదని, గత నాలుగేళ్లు గా తాను ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వద్ద లేవనెత్తుతూ ఉన్నానని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్యను ఏనాడూ తీవ్రంగా తీసుకోలేదని, ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతి ఆయనకు తెలుసు నని చెప్పారు.
చంద్రబాబు నాయకత్వం లోని టిడిపి ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జాతీయ మీడియా న్యూస్ 18తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్, ఇతర టీడీపీ నేతల అవినీతి గురించి ఆ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు, నేతలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
ఈ అవినీతి గురించి చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్‌తో పోలిస్తే చంద్రబాబు పాలన దారుణంగా ఉందని పేర్కొంటూ, చంద్రబాబు అవినీతి గురించి తానేమీ ఆకస్మాత్తుగా ఆరోపణలు చేయడం లేదని, గతంలోనే చంద్రబాబు దృష్టికి అవినీతి అంశాన్ని తీసుకెళ్లానని, ఆయన సీరియస్‌గా పట్టించు కోలేదని, తన ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసునని అన్నారు. పోలవరం ప్రాజెక్టు లోనూ అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. పది మార్కులకు గాను చంద్రబాబు పాలనకు కేవలం 2.5 మార్కులు కేటాయించారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఆరు మార్కులు ఇచ్చారు.
తన వ్యాఖ్యల వెనక భాజపా ఉందంటూ తెదేపా నేతలు నేడు మాట్లాడుతున్నారని, ఆశ్చర్యకరంగా గతంలో తన వెనక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నా డంటూ వైకాపా అధినేత జగన్ ఆరోపించారని గుర్తు చేశారు. వాస్తవానికి వారిద్దరూ చెప్పేది తప్పు. తన వెనక వారు కాదు ప్రజలు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.