ఇన్నాళ్లూ సహనం వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు సహనం కోల్పోయాడు. ఇన్నాళ్లూ మీడియాతో ఎందుకులే అంటూ మిన్నకుండిపోయిన ఆయన శుక్రవారం రెచ్చిపోయారు. వరుస ట్వీట్లతో మీడియాపై దుమ్మెత్తిపోశారు. ప్రత్యేకించి టీవీ9 పై ఆయన తన కోపాన్ని ఏమాత్రం దాచుకోకుండా ఏకిపారేశారు పవన్ కల్యాణ్.
టీవీ9 అధిపతి శ్రీనిరాజు, టీవీ9 సీఈవో రవి ప్రకాష్ , దర్శకుడు రాంగోపాల్ వర్మ, లోకేష్ స్నేహితుడు రాజేష్, లోకేష్ కలిసి 10 కోట్ల డబ్బు వెచ్చించి తనను అప్రదిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నారని ట్వీట్ల ద్వారా ఆరోపణలు గుప్పించారు. ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములు వారు చెప్పిందే వేదం పాడిందే నాదం అంటూ మీడియాపై సెటైర్లు వేశారు.
మొత్తం మీడియా పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించినా ప్రత్యేకించి టీవీ9 పై ఇంకాస్త కోపం ప్రదర్శించారు. టీవీ9 అధినేత శ్రీనిరాజుకు అందులో 89 శాతం వాటాలున్నాయని ప్రత్యేకంగా కోట్ చేశారు. అంతేకాదు.. టీవీ9 సంస్థలో ఎవరెవరికి ఎన్ని షేర్లున్నాయో లిస్టును ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శ్రీని రాజు తాజా ఫోటో ఇది అని కూడా పోస్టు చేశారు. అంటే తన అభిమానులకు ఆయన ఏం సలహా ఇస్తున్నారో.
శ్రీనిరాజు రామ్ గోపాల్ వర్మ కులానికి చెందిన వారే అంటూ మరో ట్వీట్ వేశారు. అంతేకాదు.. శ్రీనిరాజుకు సత్యం రామలింగరాజు కూడా బంధువేనంటూ కామెంట్ చేశారు. ఇలా నేరుగా ఓ మీడియా సంస్థను మూలాల్లోకి వెళ్లి యుద్దం ప్రకటించిన పవన్ కల్యాణ్ రేపటి నుంచి ఆ మీడియా సంస్థ దాడిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. టీవీ9 కూడా పవన్ కల్యాణ్ పట్ల ఎలాంటి వైఖరి అవలంభిస్తుందో చూడాలి.