దేశవ్యాప్తంగా వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బిజెపియేతర పార్టీలది వాపా ? లేకపోతే బలుపా ? అన్న విషయం అర్ధమైపోతుంది. 11 అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన సంగతి అందరికీ తెలిసిందే. అందులో నాలుగు లోక్ సభ స్ధానాల్లో మూడు చోట్ల బిజెపి ఓడిపోయిన మాట వాస్తవమే. అయితే, అందులో మూడు మాత్రమే బిజెపి సిట్టింగ్ స్ధానాలు. నాలుగోది నాగాల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ సిట్టింగ్ స్ధానం. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లోని 11 అసెంబ్లీ సీట్లలో రెండు మాత్రమే బిజెసి సిట్టింగ్ స్ధానాలు. మిగిలిన సీట్లన్నీ అకాలీదళ్, జెడియుల సిట్టింగ్ స్ధానాలతో పాటు కాంగ్రెస్, సిపిఎం, జెఎంఎం, టిఎంసి సీట్లే. రెండు సిట్టింగ్ సీట్లలో బిజెపి ఒకదాన్ని కోల్పోయిందంతే. అంటే ఇపుడు వెల్లడైన ఫలితాలను బట్టి బిజెపికి ప్రమాధ ఘంటికలు అంటూ పెద్దగా ఏమీ కనబడటం లేదు. పైగా బిజెపి పై లోక్ సభ స్ధానాల్లో ప్రతిపక్షాలు సాధించిన మెజారిటీ కూడా పెద్దగా ఏమీ లేదు. కాకపోతే పోటీ చేసిన సీట్లలో బిజెపిని ప్రజలు ఆధరించకపోవటం చిన్న విషయం కాదు.
లోక్ సభ ఫలితాలు:
ముందుగా పార్లమెంటు స్ధానాల విషయం చూద్దాం. ఉత్తరప్రదేశ్ లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్గార్, భండారా, నాగాల్యాండ్ లోని నాగాల్యాండ్ స్ధానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో కైరానా, పాల్గార్, భండారా స్ధానాలు బిజెపి సిట్టింగ్ స్ధానాలు. వీటిల్లో పాల్గార్ మాత్రమే బిజెపి నిలబెట్టుకుంది. మిగిలిన మూడు సీట్లలో ఆర్ఎల్డీ, ఎన్సీపీ, ఎన్డీపిపిలు గెలిచాయి. కైరానాలో గెలిచిన ఆర్ఎల్డీ అభ్యర్ధికి వచ్చిన మెజారిటీ 49 వేలు మాత్రమే. అలాగే, భండారాలో ఎన్సీపీ అభ్యర్ధికి వచ్చిన మెజారిటీ కేవలం 48 వేలు మాత్రమే. ఒక్క నాగాల్యాండ్ లో మాత్రమే ఎన్డీపిపి అభ్యర్ధికి లక్ష మెజారిటీ వచ్చింది. సరే బిజెపి నిలబెట్టుకున్న పాల్గార్ లో కూడా మెజారిటీ 44 వేలు మాత్రమే లేండి. అంటే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే బిజెపికి వ్యతిరేకంగా పై రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలన్నీ ఏకమైనా సాధించిన మెజారిటీ చాలా తక్కువ మాత్రమే.
అసెంబ్లీ ఫలితాలు:
ఇక, అసెంబ్లీ ఫలితాలు కూడా దాదాపు అదే సరళిలో ఉన్నాయి. ఎందుకంటే, 11 అసెంబ్లీ సీట్లలో బిజెపి గెలుచుకున్నది కేవలం ఒక్క సీటు మాత్రమే. అయితే, ఉప ఎన్నికలు జరిగిన 11 సీట్లలో బిజెపిది కేవలం రెండు సీట్లు మాత్రమే. అందులో ఒక సీటు కోల్పోవటమే బిజెపికి నష్టం. మిగిలిన 9 సీట్లలో ఒకటి మిత్రపక్షం అకాలీదళ్ కాగా మరోటి జెడియుది. మిగిలిన ఏడు సీట్లు కూడా బిజెపియేతర పక్షాలైన జెఎంఎం, కాంగ్రెస్, సిపిఎం, టిఎంసి లవే. ఉప ఎన్నికల్లో బిజెపియేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్ధిని పెట్టాయి కాబట్టి 10 సీట్లలో విజయం సాధించాయి. కాకపోతే ఉత్తరప్రదేశ్ లోని నూర్ పూర్ అసెంబ్లీ స్ధానాన్ని బిజెపి కోల్పోయింది. అది కూడా 6211 ఓట్ల మెజారిటీతో మాత్రమే ఎస్పీ అభ్యర్ధి గెలిచిన విషయాన్ని గమనించాలి. ఉప ఎన్నికలు జరిగిన 11 సీట్లలో కాంగ్రెస్, జెఎంఎం, టిఎంసి, సిపిఎం పార్టీలు తమ స్ధానాలను తాము తిరిగి నిలబెట్టుకున్నాయంతే.
బిజెపి వ్యతిరేక ప్రచారం:
ఉప ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే బిజెపికి మోగుతున్న ప్రమాద ఘంటికలేమీ కనబడటం లేదు. ఉప ఎన్నికలన్నాక గెలుపోటములు సాధారణమే. అధికారంలో ఉన్న పార్టీలపై జనాల్లో వ్యతిరేక సాధారణమే. ప్రతిపక్షాలన్నీ జాగ్రత్తగా ఉమ్మడి అభ్యర్ధిని నిలబెడితే గెలవటమన్నది మనకు కొత్త కూడా కాదు. మరి వాస్తవాలు ఇలావుండగా, ఉప ఎన్నికల ఫలితాల ట్రెండ్ మొదలైనప్పటి నుండి బిజెపికి వ్యతిరేకంగా మీడియా ఎందుకు ఒకటే ఊదరగొడుతోంది ? అంటే, బిజెపిపై తెలుగు రాష్ట్రాల్లోని పాలక పార్టీలకున్న వ్యతిరేకతే కారణమని చెప్పక తప్పదు. తెలంగాణా, ఏపిల్లో టిఆర్ఎస్, తెలుగుదేశంపార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటికి మద్దతుగా నిలబడుతున్న మీడియాకు కూడా బిజెపి బద్ద శతృవే అన్న విషయం ఎవరికైనా అర్ధమవుతుంది. కాబట్టే బిజెపిపై అంతగా వ్యతిరేక ప్రచారాన్ని భుజానేసుకుంది తెలుగు మీడియా. నిజానికిది కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న సామెత లాంటిదే. ఎందుకంటే, ఉప ఎన్నికల ఫలితాలపై ఇటు టిఆర్ఎస్ అటు టిడిపిలు పెద్దగా స్పందిచకపోయినా వాటికి మద్దతిస్తున్న మీడియా మాత్రం బిజెపి వ్యతిరేక ప్రచారంతో హోరెత్తించేయటం విచిత్రం.