ఉప ఎన్నికలకు చంద్రబాబునాయుడు సవాలు విసిరారు. వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసిన పార్లమెంటు స్ధానాల్లో వచ్చే ఉప ఎన్నికలను తన పాలనకు రెఫరెండంగా తీసుకుంటామని చంద్రబాబు ఆదివారం స్పష్టం చేశారు. కాకపోతే చంద్రబాబు ఒక విచిత్రమైన షరతు కూడా విధించారండోయ్. తాము చేసిన రాజీనామాలను వైసిపి ఎంపిలు స్పీకర్ తో మాట్లాడి ఆమోదం పొందాలట. రాజీనామాల ఆమోదం విషయంలో వైసిపి ఎటువంటి కుట్రలకు పాల్పడకూడదట. ఎలాగుంది చంద్రన్న షరతులు ?
ఎంపిలతో స్పీకర్ సమావేశం
ప్రత్యేకహోదా డిమాండ్ తో ఐదుగురు వైసిపి ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు రాజీనామాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత ఢిల్లీలోని ఏపి భవన్లో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారు. కాకపోతే అనారోగ్య కారణాలతో ఢిల్లీ ప్రభుత్వం ఎంపిల దీక్షను భగ్నం చేసింది. ఈమధ్యనే లోక్ సభ స్పీకర్ రాజీనామాల ఆమోదం విషయంలో ఎంపిలతో సమావేశమయ్యారు. రాజీనామాల విషయమై ఎంపిలు ఆమోదం కోసమే పట్టుబట్టారు. అయితే, స్పీకర్ ఎంపిలతో మరోసారి భేటీ అవుదామని చెప్పటంతో సమావేశం వాయిదా పడింది. మళ్ళీ ఈనెల 5 లేదా 6వ తేదీన ఎంపిలతో సమావేశం జరుగుతుంది.

వైసిపికి చంద్రబాబు సవాల్
అదే విషయమై చంద్రబాబు ఈరోజు మాట్లాడుతూ, వైసిపికి సవాలు విసిరారు. ఉప ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామంటూ చెప్పారు. 2019 సాధారణ ఎన్నికలకు రాబోయే ఉప ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటానంటూ చంద్రబాబు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, మామూలుగా చంద్రబాబు ఇటువంటి సవాళ్ళు చేయరు. బహిరంగంగా రెఫరెండం అనే సవాలు విసిరారంటే తెరవెనుక ఏదో పెద్ద ప్లాన్ వేసుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయా ?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైసిపి, బిజెపి, జనసేనలు అడ్డుపడుతున్నాయన్న విచత్రమైన ఆరోపణ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండే పార్టీలు పోలవరానికి ఏ విధంగా అడ్డుపడుతున్నాయో చంద్రబాబే చెప్పాలి. పైగా ఎన్ని పార్టీలు అడ్డుపడినా ప్రాజెక్టు పనులు మాత్రం ఆగవంటూ మళ్ళీ చంద్రబాబే చెబుతున్నారు. అంటే తానేం మాట్లాడుతున్నారో చంద్రబాబుకే అర్ధం కావటం లేదా అన్న అనుమానాలు వస్తున్నాయ్.
