ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నట్లు కనబడుతోంది. నియోజకవర్గంలో అన్నీ వైపుల నుండి శతృవులు పెరిగిపోతుండటంతో మంత్రిలో రోజురోజుకు ఆందోళన పెరిగిపోతున్నట్లుంది. పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి, ప్రొద్దటూరులోని వరదరాజుల రెడ్డి, కమలాపురంకు చెందిన వీరశివారెడ్డితో ఏమాత్రం పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో తన శతృవులంతా ఏకమైతే ఫిరాయింపు మంత్రి గెలుపు అనుమానమే. పార్టీలో పెరుగిపోతున్న శతృవులతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతలు ఎటూ కత్తి కట్టే ఉన్నారు. దాంతో మంత్రిలో ఓటమి భయం పెరిగిపోతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. దాని ఫలితమే ఆదివారం పెద్దదండ్లూరుకు వచ్చిన వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి మద్దతుదారులపై దాడులు చేయటం.
మంత్రి భార్యే దాడులు చేయించారా ?
మామూలుగా అయితే జిల్లాలో ఎక్కడ ఎవరిపై దాడులు జరిగినా ఆడవాళ్ళ పాత్ర ఉండే అవకాశాలు తక్కువే. జిల్లాలో ఫ్యాక్షన్ దాడుల చరిత్ర చూసినా ఆడవాళ్ళు దగ్గరుండి చేయించిన దాడులు లేవనే చెప్పాలి. అటువంటిది ఆదివారం వైసిపి, టిడిపి ఎంఎల్సీ అనుచరులపై మంత్రి మద్దతుదారులు చేసిన దాడుల్లో మంత్రి భార్య దగ్గరుండి దాడులకు ప్రోత్సహించినట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఆరోపణలకు ఆధారాలుగా కొన్ని ఫొటోలు, వీడియో ఫుటేజీలు కూడా విడుదల చేయటం గమనార్హం. ఇక్కడ విచిత్రమేమిటంటే ఎటూ వైసిపి మద్దతుదారులపై దాడులు చేస్తున్నారు కాబట్టి టిడిపి ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి అనుచరులపైన కూడా మంత్రి దాడులు చేయించారు. స్వయానా మంత్రి కొడుకు సుధీర్ రెడ్డి, భార్య అరుణ, సోదరుని భార్య సూచనలు ఇచ్చి దాడులు చేయించటం గమనార్హం.
ఎంఎల్సీ మద్దతుదారులపైనా దాడి
మంత్రి ఆదినారాయణరెడ్డిపై టిడిపికే చెందిన ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి ఫైరయ్యారు. ఆదివారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరులో జరిగిన గొడవకు సంబంధించి గాయపడిన తన వర్గీయులను పరామర్శించేందుకు ఎంఎల్సీ ఆసుపత్రికి వచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ మంత్రిని తీవ్రంగా హెచ్చరించారు. కడప వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి వర్గీయులపై దాడి చేసిన మంత్రి అనుచరులు పనిలో పనిగా ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులపైన కూడా దాడి చేశారు. మంత్రికి వైసిపితో నేతలతో పాటు టిడిపి ఎంఎల్సీ రామసుబ్బారెడ్డితో కూడా పడదన్న విషయం అందరికీ తెలిసిందే. వైసిపి నేతలు, అనుచరులపై దాడి సందర్భంగా అవకాశం వచ్చింది కదా అన్న ఉద్దేశ్యంతో ఎంఎల్సీ వర్గీయులపై మంత్రి అనుచరులు దాడి చేసినట్లు అందరూ అనుమానిస్తున్నారు. అదే విషయాన్ని ఎఎంల్సీ కూడా చెబుతున్నారు.
మంత్రిపై ఎంఎల్సీ ఫైర్
తన మద్దతుదారులపై ఫిరాయింపు మంత్రి మద్దతుదారులతో దాడులు చేయించటంపై రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిది నీచ సంస్కృతిగా వర్ణించారు. తన అనుచరులపై అన్యాయంగా మంత్రి దాడులు చేయించారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ జరిగింది వేరని ఇకపై జరగబోయేది మాత్రం వేరుగా ఉంటుందంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో తన అనుచరులపై దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ధ్వజమెత్తారు.