కేంద్రప్రభుత్వం, బిజెపి పై చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మపోరాటాలకు జనాలు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు కనబడటం లేదు. చంద్రబాబు నాలుగేళ్ళ ఎన్డీఏలో ఉంటూ బిజెపితో అంటకాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సంవత్సరంలో బిజెపితో కటీఫ్ చెప్పేసి రివర్స్ గేరు తో కేంద్రంపై చంద్రబాబు మండిపడుతుంటే వినటానికి భలే క్యామిడీగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాలుగేళ్ళు బిజెపితో కలిసున్నారట. ఐదవ బడ్జెట్లో కూడా ఏపి ప్రయోజనాలను పట్టించుకోకపోవటంతో ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశానంటున్నారు నిప్పు నారా వారు.
బిజెపి, టిడిపి రెండూ పాతరేసినవే

రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రప్రభుత్వం పాతరేసిందన్నది ఎంత వాస్తవంమో బిజెపితో చేతులు కలిపి టిడిపి కూడా రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిందీ అంతే వాస్తవం. అయితే, రెండు పార్టీల మీద జనాల్లోని ఆగ్రహాన్ని గమనించిన తర్వాత చంద్రబాబు హటాత్తుగా మేలుకున్నారు. ఇంకా బిజెపితో కలుసుంటే వచ్చే ఎన్నికల్లో సీన్ సితారే అని అర్ధమైపోయింది. దాంతో వెంటనే యు టర్న్ తీసుకోవాలని అనుకున్నారు.
జనాలను రెచ్చ గొట్టటానికే ధర్మపోరాటం

అందుకే ఐదో బడ్జెట్ రూపంలో అవకాశం రాగానే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. ఇక అప్పటి నుండి కేంద్రంతో పాటు బిజెపి, ప్రధానమంత్రి నరేంద్రమోడి పై మండిపడుతున్నారు. కేంద్రంపై జనాలను రెచ్చ గొట్టటంలో భాగంగానే రాష్ట్రమంతా సభలు పెడుతున్నారు. ఆ సభలకే చంద్రబాబు ధర్మపోరాటమని నామకరణం చేశారు. ఆ సభల్లో కేంద్రంపై దుమ్మెత్తిపోయటమే చంద్రబాబు ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు.
వైసిపి, జనసేన, బిజెపి రాష్ట్ర ద్రోహులా ?
ఒక్క కేంద్రంపై మాత్రమే మాట్లాడితే చంద్రబాబు ఎందుకవుతారు ? అందుకే పనిలో పనిగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మధ్యలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబు చెప్పేదేమంటే టిడిపికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందిరినీ జనాలు రాష్ట్ర ద్రోహులుగా చూడాలట. తాను మాత్రం నిప్పట. రాష్ట్ర ప్రజలకు టిడిపి మాత్రమే దిక్కంటున్నారు. వైసిపి, జనసేన, బిజెపిల అవసరమే రాష్ట్రానికి లేదట. అంటే చంద్రబాబు దృష్టిలో రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదు.
స్పందించని జనాలు

విచిత్రమేమిటంటే, పోయిన ఎన్నికల్లో బిజెపి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తున్నచంద్రబాబు తానిచ్చిన హామీల సంగతి మాత్రం మాట్లాడటం లేదు. హామీ ఇచ్చి నెరవేర్చని మోడి పై జనాలను రెచ్చగొట్టాలని చంద్రబాబు చేస్తున్నప్రయత్నాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, మోడిని వ్యతిరేకించాలని చంద్రబాబు ఎంత చెబుతున్నా జనాల్లో పెద్ద స్పందన కనబడటం లేదు. చివరకు తాను చెప్పింది చెప్పండంటూ చంద్రబాబు మొత్తుకుంటున్నా జనాలు పట్టించుకోని విషయం నిన్నటి కాకినాడ ధర్మపోరాట సభలో స్ఫష్టంగా తెలిసిపోయింది. అధికారంలో ఉన్నారు కాబట్టి జనాలను తేగలిగారు కానీ జనాల్లో నుండి స్పందన మాత్రం రాబట్టలేకపోతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.