క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో వైసిపికి పట్టు పెరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. పోయిన ఎన్నికల సమయానికి ప్రస్తుతానికి వైసిపి ఏ మేరకు పుంజుకుందో స్పష్టంగా తెలీదు కానీ టిడిపి మాత్రం బాగా దెబ్బ తిన్న విషయం అర్ధమైపోతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసిపికి పోయిన ఎన్నికల్లో కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే తెలుగుదేశంపార్టీ మైనస్సే వైసిపికి ప్లస్ అన్నమాట. అంటే పోయిన ఎన్నికల్లో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి 30 స్ధానాల్లో గెలవగా, టిడిపి 22 చోట్ల మాత్రమే గెలిచింది.
3 జిల్లాల్లో వైసిపిదే పై చేయి
రాయలసీమ నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్లున్నాయి. నాలుగు జిల్లాలు కూడా ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం డామినేటెడ్ జిల్లాలే అన్న సంగతి అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు వైసిపికి మద్దతుగా నిలవగా అనంతపురం జిల్లా మాత్రం టిడిపిని బాగా ఆదుకుంది. కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి 11 నియోజకవర్గాల్లో గెలిచింది. కడప జిల్లాలోని 10 నియెజకవర్గాల్లో వైసిపి ఏకంగా 9 చోట్ల విజయం సాధించింది. అలాగే, చంద్రబాబునాయడు సొంత జిల్లా అయిన చిత్తూరులోని 14 నియోజకవర్గాల్లో మెజారిటి స్ధానాల్లో అంటే 8 స్ధానాలను గెలుచుకుంది. అనంతపురం జిల్లాలో మాత్రం వైసిపికి బాగా దెబ్బ పడింది. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టిడిపి 12 చోట్ల గెలిచింది. అంటే వైసిపి
ఫిరాయింపులతో పెరిగిన టిడిపి వాపు
అయితే గడచిన నాలుగేళ్ళలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. రాయలసీమలోని అత్యధిక సీట్లను వైసిపి గెలుచుకోవటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. దాంతో ఫిరాయింపుల ద్వారా కర్నూలు జిల్లాలో నాలుగురు ఎంఎల్ఏలు, కడప జిల్లాలో ఇద్దరు ఎంఎల్ఏలను, చిత్తూరు జిల్లాలో ఒకరిని టిడిపిలోకి లాక్కుని తన బలం పెరిగిందని అనిపించుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసిపిని దెబ్బ కొట్టేందుకు తన శక్తివంచన లేకుండా వ్యూహాలు పన్నుతున్నారు.
ఎదురుతిరిగిన ఫిరాయింపుల వ్యూహం
చంద్రబాబు ఒకవైపు వైసిపిని దెబ్బకొట్టేందుకు ఒక వైపు వ్యూహాలు పన్నుతుండగానే మరోవైపు టిడిపి బలహీన పడుతుండటం విచిత్రంగా ఉంది. క్షేత్రస్ధాయిలో పరిస్దితులు చూస్తే నాలుగు జిల్లాల్లోనూ పోయిన ఎన్నికల నాటితో పోల్చుకుంటే టిడిపి బలహీన పడినట్లుగానే కనిపిస్తోంది. ఎలాగంటే, వైసిపిని దెబ్బకొట్టటానికి ప్రోత్సహించిన ఫిరాయింపుల వ్యూహమే చంద్రబాబుకు ఎదురుతిరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ, నంద్యాల, కోడుమూరు, కర్నూలు, బనగానిపల్లి నియోజకవర్గాల్లో ఫిరాయింపులు, టిడిపి ఎంఎల్ఏలు, నేతలు రోడ్డునపడి కొట్టేసుకుంటున్నారు. వీరి మధ్య గొడవలను సర్దుబాటు చేయటానికి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు.
కడప జిల్లాలో వర్గ విభేదాలు
అలాగే, కడప జిల్లాలోకూడా నేతల మధ్య వివాదాలు తీవ్రమైపోయాయి. ఈ జిల్లాలో కూడా ఫిరాయింపు మంత్రి ఆది నారాయణ రెడ్డితో తమ్యుళ్ళకు టిడిపి ఎంఎల్ఏలకు ఏమాత్రం పడటం లేదు. అదే విధంగా బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములు కు టిడిపి నేతలకు పొసగటం లేదు. రోజు రోజుకు నేతల మధ్య విభేదాలు తీవ్రమైపోతున్నాయి. ఇక్కడ గొడవలు ఏ స్ధాయికి చేరుకున్నాయంటే రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఆది నారాయణరెడ్డి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డి వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునేదాకా వెళ్ళింది. ఈ జిల్లాలో కూడా చంద్రబాబు పంచాయితీని ఎవరూ లెక్క చేయటం లేదు.
జిల్లా అంతా గ్రూపుల మయమే..జెసినే పెద్ద సమస్య ?
అదే విధంగా అనంతపురం జిల్లాను చూస్తే 13 ఎల్ఎల మధ్య వంద గ్రూపులున్నాయి. ఈ జిల్లాలో టిడిపికి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి పెద్ద సమస్యగా మారారు. ఆయనకు తన పరిధిలోని ఏడుగురు ఎంఎల్ఏల్లో ఏ ఒక్కరితోనూ పడటం లేదు. అదే విధంగా మొత్తం జిల్లాను తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలన్న కోరికతో జిల్లాలోని ఎంఎల్ఏలందరికీ పొగపెడుతున్నారు. ప్రతీ ఎంఎల్ఏకి వాళ్ళ నియోజకవర్గాల్లో తన వర్గంలోని నేతలను పోటీగా తయారు చేసి వారికి టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. బహిరంగంగా జెసి చెప్పిన లెక్క ప్రకారమే వచ్చే ఎన్నికల్లో టిడిపి 3 నియోజకవర్గాలకన్నా గెలవదు. చివరగా చిత్తూరు జిల్లాను చూసినా టిడిపి పరిస్ధితి ఏమంత ఆశాజనకంగా లేదు. పోయినసారి గెలిచిన 6 స్ధానాలను అయినా నిలుపుకుంటుందా అన్నది సందేహమే అని స్వయంగా టిడిపి నేతలే చెబుతున్నారు. పార్టీలో పెరిగిపోయిన అంతర్గవ విభేదాలకు తోడు జనాల వ్యతిరేకత కూడా బాగా పెరిగిపోతుండటంతో రాయలసీమలో వచ్చే ఎన్నికల్లో వైసిపి మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి.